మనస్తాపంతో మామిడి రైతు ఆత్మహత్య
-మామిడి పూత రాలిందనే మనస్తాపంతో మామిడి రైతు ఆత్మహత్య
వరంగల్ టైమ్స్, మంచిర్యాల జిల్లా: చెన్నూరు పట్టణంలో మామిడి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మారిన వాతావరణ పరిస్థితులతో మామిడి పూత మొత్తం రాలిపోవడం.పూతను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపం చెందిన ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నూర్ పట్టణంలోని కొత్త గూడెం కాలనీకి చెందిన మామిడి రైతు ఎల్లబోయిన మల్లేశ్(47)కు రెండెకరాల మామిడి తోట ఉంది. ఈ యేడాది దండిగా పూత రావడంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించాడు. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మామిడిపూత రాలిపోయింది. పూతను కాపాడేందుకు రసాయన ఎరువులు పిచికారీ చేసినా నిరాశే మిగిలింది. దీంతో శనివారం సాయంత్రం మామిడి తోటకు వెళ్లొస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి రాత్రయినా తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తోట దగ్గరికి వెళ్లి చూడగా పురుగుల మందు తాగి అపస్మరక స్థితిలో పడి ఉన్నాడు. స్థానిక అస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.














