పోతననగర్ శ్మశాన వాటికలో రాజు అంత్యక్రియలు

పోతననగర్ శ్మశాన వాటికలో రాజు అంత్యక్రియలు

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఆరేళ్ల చిన్నారి అత్యాచారం చేసి హత్య చేసిన పల్లకొండ రాజు గురువారం ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి రాజు మృతదేహానికి జనగామ రైల్వే పోలీసులు పంచనామా నిర్వహించి, ప్రాథమిక విచారణ పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. మధ్యాహ్నం 1.45 గంటలకు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.పోతననగర్ శ్మశాన వాటికలో రాజు అంత్యక్రియలు సాయంత్రం 4 గంటల సమయంలో మృతుడి బావమరిది కేదరి సురేష్, మహేష్ లు ఇద్దరు ఎంజీఎం చేరుకుని మృతుడిని పల్లకొండ రాజుగా గుర్తించడంతో పోలీసులు ప్రత్యేక వాహనంలో మృతుడి తల్లి, సోదరితో పాటు భార్యను ఎంజీఎం మార్చురీకి తీసుకువచ్చారు. కుటుంబసభ్యులు గుర్తించిన తదుపరి ఫోరెన్సిక్ నిపుణులు రాజామాలిక్ బృందం, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించారు.

తదనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి మట్టెవాడ పోలీసులు, కార్పొరేషన్ అధికారులు పోతన నగర్ శ్మశాన వాటికలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తీసుకువస్తున్న సమయంలో అంబులెన్స్ మార్చురీ వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తి అంబులెన్స్ పై చెప్పులను విసిరివేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

వరంగల్ ఏసీపీ కలకోట గిరికుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, భద్రత చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం ప్రక్రియ సుమారు 7.30 నిమిషాలకు పూర్తయ్యినప్పటికీ పోలీసులు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేయడం కోసం సుమారు 2 గంటల పాటు మార్చురీలోనే ఉంచారు. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత వరంగల్ ఏసీపీ పర్యవేక్షణలో మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. రాత్రి 9 గంటల సమయంలో తల్లి చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు.