ఆయిల్ పామ్ నర్సరీలను సందర్శించిన జంగా రాఘవరెడ్డి

వరంగల్ టైమ్స్, ఉమ్మడి ఖమ్మం జిల్లా: తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలతో కూడిన నాణ్యమైన నర్సరీలను ఏర్పాటు చేస్తోంది. మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో ఈ నర్సరీలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 1 మీటరు ఎత్తు పెరిగిన ఆరోగ్యకరమైన మొలకలను రైతులకు పంపిణీ చేస్తారు. ఈ మొక్కలను సబ్సిడీ ద్వారా రైతులకు ప్రభుత్వం అందిస్తోంది. ఆయిల్ ఫాం సాగును ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి అమలు పరుస్తున్నారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. రైతులకు అవగాహన కల్పిస్తూ సాగులో మెలకువలు తెల్పుతున్నారు. ఇందులో భాగంగానే బుధవారం తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. అశ్వరావు పేట, దమ్మపేట,కల్లూరి గూడెం ప్రాంతాలలో ఆయిల్ పామ్ నర్సరీలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. సాగు తీరును నర్సరీల నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ పామ్ సాగులో మొక్కల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు తెలిపారు.
ఈ సందర్భంగా జంగా రాఘవ రెడ్డి పలు ముఖ్య అంశాలను ప్రస్తావించారు.నాణ్యమైన మొక్కల సరఫరా లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.రైతులకు అధిక దిగుబడి ఇచ్చే,రోగ నిరోధకత కలిగిన ఆయిల్ పాం మొక్కలను అందించడమే ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. నర్సరీల ప్రమాణాల పరిశీలన చాలా ముఖ్యమైందన్నారు. ఇందులో మొక్కల పెంపకం విధానం,మట్టి మిశ్రమం, నీటి సరఫరా, షేడ్‌నెట్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. రైతులకు సాంకేతిక మార్గదర్శనం చేయడం చాలా అవసరం అన్నారు. ఇందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగులో ఆధునిక పద్ధతులు, ఎరువుల వినియోగం,పురుగుమందుల నియంత్రణపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగులో నీటి వనరుల సమర్థ వినియోగం చాలా ముఖ్యమన్నారు.డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి పొదుపు చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.
రైతు ఆదాయం పెంపు దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయిల్ పాం సాగు ద్వారా రైతుల స్థిరమైన ఆదాయం పెరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. ప్రాసెసింగ్ యూనిట్లను బలోపేతం చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు జంగా రాఘవరెడ్డి. ఈ తరుణంలోనే పండిన తాటి గుత్తులను త్వరగా సేకరించి సమీప ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించే విధంగా మౌలిక సదుపాయాలు బలోపేతం చేయాలని అన్నారు. ఆయిల్ పామ్ సాగులో రైతులతో ప్రత్యక్ష సంభాషణ చాలా అవసరం అన్నారు. రైతుల సమస్యలు, సూచనలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జంగా రాఘవరెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు విస్తరణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముందంజలో ఉండాలని, నాణ్యత,పారదర్శకత,రైతు ప్రయోజనం అనే మూడు సూత్రాలతో తెలంగాణ ఆయిల్ ఫెడ్ పనిచేస్తుందని చైర్మన్ జంగా రాఘవరెడ్డి సందర్శనలో స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి వెంట జీఎం సుధాకర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ సిబ్బంది తదితరులు వున్నారు.














