వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : దొంగే దొంగా దొంగా అన్న చందంగా ఉంది బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల వ్యవహారమని జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్, మోడీ ప్రజా ద్రోహులని మండిపడ్డారు. ఎంతో హడావుడిగా తెలంగాణ ఏర్పాటు బిల్లును చర్చించకుండానే ఆమోదింపచేశారని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ ను విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ శ్రేణులు మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డాయి. మోడీ వైఖరిని ఖండిస్తూ నిరసన గళం విప్పారు.
ఇందులో భాగంగానే కాజీపేట మీడియా పాయింట్ లో జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీపై, సీఎం కేసీఆర్ పై జంగా రాఘవరెడ్డి విమర్శనాస్త్రాలు గుప్పించారు. రాజ్యాంగాన్నే మార్చాలన్న కేసీఆర్ తీరు, రాష్ట్ర విభజన సరిగ్గా జరుగలేదన్న మోడీ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరచడం సరైంది కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం వల్లనే ఏపీకీ నష్టం జరిగిందనడం సిగ్గుచేటన్నారు. అమరుల త్యాగాలను అగౌరవపరిచేలా మాట్లాడిన మోడీ ప్రధానినా లేదా ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తనా అని జంగా ప్రశ్నించారు.
బీజేపీకి, మోడీకి రాముని పై ప్రేమ వుంటే ఆంధ్రాలో కలిపిన భద్రాద్రిలోని 7 మండలాలను తెలంగాణలో ఎందుకు కలుపలేదని జంగా రాఘవరెడ్డి ప్రశ్నించారు. మతతత్వమే నీ విధానమా మోడీ అంటూ జంగా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సపోర్ట్ చేశామని చెప్పుకుంటున్న తెలంగాణ బీజేపీ నాయకులు మోడీ వ్యాఖ్యలను సమర్ధించకుండా నిలదీయాలని జంగా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. అదీ చేతకాకపోతే డొంకతిరుగుడు లేకుండా బీజేపీ నుంచి బయటికి వచ్చి తెలంగాణ పట్ల ప్రేమను చూపించుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణలో విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా వున్నాయని విమర్శించారు.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అంతోకొంత బడ్జెట్ వచ్చిందంటే కాంగ్రెస్ పోరాటం వల్లనేనని ఆయన అన్నారు. విభజన హామీల సంగతేంటని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇక ప్రజాసమస్యలను పక్కనపెట్టేందుకే ఢిల్లీలో దోస్తీ, గల్లీలో లొల్లిలు పెట్టుకుంటున్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే కాంగ్రెస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని జంగా రాఘవరెడ్డి హెచ్చరించారు.