5గురు మున్సిపల్ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు

5గురు మున్సిపల్ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలువరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్ బీపాస్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులపై పురపాలక శాఖ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇంటి అనుమతికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను స్థానికంగా పరిశీలించే నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు రాగానే వెంటనే పరిశీలించి ఆ వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర కార్యాలయానికి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఎస్ బీపాస్ పరిశీలనలో తేలింది.

ఈ నేపథ్యంలో భవిష్యత్ లో అధికారులు, ఉద్యోగులు దరఖాస్తుల పరిశీలనలో సీరియస్ గా వ్యవహరించాలనే ఉద్దేశంతో సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఐదుగురు ఉద్యోగులను వేతనాల్లో రూ.5వేల చొప్పున కోత విధించాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సీడీఎంఏ ఎన్. సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. మణిభూషణ్ (నర్సాపూర్ మున్సిపాలిటీ), కే.యశ్వంత్ రెడ్డి ( కామారెడ్డి), యాదయ్య ( ఇబ్రహీంపట్నం), టీ సురేష్ ( ఖమ్మం), అహ్మద్ ( మక్తల్ మున్సిపాలిటీ) లపై చర్యలు తీసుకున్నట్లు పురపాలక శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.