రాష్ట్ర విభజనపై మోడీ విషం కక్కాడు:ఎర్రబెల్లి

రాష్ట్ర విభజనపై మోడీ విషం కక్కాడు:ఎర్రబెల్లివరంగల్ టైమ్స్, జనగామ జిల్లా: తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ విషం కక్కాడని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాపీ కొట్టి దేశంలో అమలు చేసే దిక్కుమాలిన తెలివి బీజేపీదని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి.

మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి దయాకర్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు నల్లకండువాలు కప్పుకుని బైక్ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని రాయపర్తి, తొర్రూరు, పాలకుర్తి, దేవరుప్పుల మండల కేంద్రాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా బైక్ ర్యాలీలో పాల్గొని నిరసన గళం విప్పారు.

రాష్ట్ర విభజన రాజ్యాంగ బద్దంగా జరిగిందని, తెలంగాణ విభజనను వ్యతిరేకించినా, కించపరిచినా రాజ్యాంగాన్ని కించపరచడమేనని మంత్రి అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఇక తెలంగాణపై కుట్రకు తెరలేపిన బీజేపీకి టీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. మతం పేరుతో విభజించి పాలించే దిగజారుడు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతున్నదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ప్రజలకు సూచించారు.
/