తెలంగాణను వణికిస్తున్న కరోనా వైరస్

తెలంగాణను వణికిస్తున్న కరోనా వైరస్హైదరాబాద్: ఈ క్రమంలో రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకొని ఆలయాల్లో అధికారులు కొవిడ్ ఆంక్షలను అమలులోకి తీసుకువచ్చారు.వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, ధర్మపురి ఆలయాల్లో అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 13న ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు ఆంక్షలు తీసుకువచ్చారు.

ముక్కోటి ఏకాదశి రోజున ఆలయంలో భక్తులను అనుమతించడం లేదని చెప్పారు. స్వామివారికి ఏకాంతంగానే పూజలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే కొమురవెల్లి మల్లన్న ఆలయం కొవిడ్ ఆంక్షలను అధికారులు అమలులోకి తీసుకువచ్చారు. రెండు డోసుల టీకా సర్టిఫికెట్ ఉన్న భక్తులకే మల్లన్న దర్శనం కల్పిస్తామని చెప్పారు. మల్లన్న జాతర రద్దీ దృష్ట్యా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 16న జాతర ప్రారంభం కానుండగా..మూడు నెలల పాటు కొనసాగనున్నది. ఈ క్రమంలో జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.

కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 17న నిర్వహించాల్సిన పట్నం, అగ్నిగుండాలను అధికారులు రద్దు చేశారు. జగిత్యాల కొండగట్టు ఆంజనేస్వామి సన్నిధిలోనూ కరోనా నేపథ్యంలో పలు వేడుకలకు భక్తులను అనుమతించొద్దని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకల్లో అర్చకులు, అధికారులకే అనుమతి ఇచ్చారు. గోదా రంగనాథ స్వామి కల్యాణానికి సైతం భక్తులను అనుమతించొద్దని, కొవిడ్ నిబంధనల ప్రకారం సాధారణ దర్శనాలకు అనుమతి లేదని చెప్పారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. అన్ని వేడుకలను భక్తులు లేకుండానే నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.