వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

వరంగల్ టైమ్స్, సిద్దిపేట జిల్లా : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ, పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక ఆదివారం ఉదయం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో పాటు రూ. కోటి విలువైన బంగారు కిరీటాన్ని మంత్రి హరీష్ రావు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా మల్లన్న శరణు శరణు అంటూ మార్మోగిపోయింది. శివశక్తులు శివాలెత్తి పోయారు. మల్లన్న కల్యాణాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సంప్రదాయబద్దంగా ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో మల్లన్న స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణంఅనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణం ఘనంగా , వైభవంగా జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికై రూ. 30 కోట్లు కేటాయించారు. ఇప్పటికే కొమురవెల్లి మల్లన్న స్వామివారిని రెండు సార్లు దర్శించుకున్నారని గుర్తు చేశారు. వచ్చే యేడాది మల్లన్న స్వామి కల్యాణం వరకు కేతమ్మ, మేడమ్మల అమ్మవార్లకు ఒక కిలో స్వర్ణ కిరీటం తయారు చేయిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కొందరు ఎన్ని కుట్రలు చేసిన మల్లన్న దయతో మల్లన్న సాగర్ అనుకున్న సమయానికి పూర్తి చేసామని అన్నారు. రూ. 11 కోట్ల తో భక్తులకు కావాల్సిన క్యూలైన్లు, 50 గదులతో సత్రం, కోనేరు అభివృద్ధి, దేవాలయం అభివృద్ధి ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.