స్పోర్ట్స్ మెటీరియల్ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం 

స్పోర్ట్స్ మెటీరియల్ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సికింద్రాబాద్ నల్లగుట్టలోని స్పోర్ట్స్ సామాగ్రి, కారు డెకర్స్ సామాగ్రికి సంబంధించిన గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెగ్జిన్, సింథటిక్, ఫైబర్, ప్లాస్టిక్ కు సంబంధించిన భారీ మెటీరియల్ అందులో ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనున్న భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన అధికార యంత్రాంగం భవనం చుట్టుప్రక్కల ఉన్న నివాసాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. 30 ఫైర్ ఫైటర్స్ తో సాయంత్రానికి మంటలను అదుపులోకి తెచ్చారు. జలమండలి నుంచి 70 ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తూ మంటలు ఆర్పేందుకు చర్యలు తీసుకున్నారు.

కాగా, మంటలు వ్యాపించగానే గోడౌన్ లో ఉన్న పలువురు బయటకు పరుగులు తీశారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది నలుగురిని కాపాడింది. మరో ముగ్గురి ఆచూకి తెలియకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ కోసం ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు.