బంజారా మహిళలతో మంత్రి కొండా సురేఖ డ్యాన్స్
-సంత్ సేవాలాల్ 287వ జయంతి ఉత్సవంలో పాల్గొన్న మంత్రి
-బంజారాల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం సహకారం అందిస్తా….
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: పీడిత వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ కొనియాడారు. సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతిని పురస్కరించుకొని వరంగల్ పరిధి 19 వ డివిజన్ కాశీబుగ్గ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. బంజారాలతో కలిసి నృత్యాలు చేశారు. సంత్ సేవాలాల్ చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి డోలు వాయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డీటీడీఓ నారాయణ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మహిళలు, పీడిత వర్గాల సమానత్వం కోసం సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకం, ఆచరణీయమని మంత్రి అన్నారు. బంజారా బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారి అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సత్యం, అహింస, మానవత్వం, సమానత్వానికి ఉన్నతమైన నైతిక విలువల సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా సమాజంలో నూతన చైతన్యాన్ని నింపారని, ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం దేశ ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు చూపిన శాంతి మార్గాన్ని, ఆయన బోధించిన జీవన విలువలను మనసారా స్మరించుకుందామని మాంత్రి పిలుపునిచ్చారు.
బంజారాల ఆరాధ్య దైవం గురువు సంత్ సేవాలాల్ అని ఆయనను జగదాంబ మాత అంశంగా బంజారాలు భావిస్తారని అన్నారు. తన జీవితాన్ని సమాజ సేవ కోసం అంకితం చేశారని తెలిపారు. ఆయన చేసిన సామాజిక సేవలు సంస్కరణలు అనేకం అన్నారు. సేవాలాల్ మహారాజ్ కేవలం ఆధ్యాత్మిక గురువే కాదని బంజారాల జాతిని చైతన్యం చేసిన గొప్ప మహనీయుడని తెలిపారు. ఆ కాలంలో ఉన్న మూఢనమ్మకాలను జంతు బలులను తీవ్రంగా వ్యతిరేకించారని, జీవ హింస మహా పాపం అని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. మద్యపానం ధూమపానం మనిషితో పాటుగా కుటుంబాలను నాశనం చేస్తాయని, వాటిని విడనాడాలని సేవాలాల్ సూచించారని గుర్తు చేశారు. వందల సంవత్సరాల క్రితమే మహిళలకు సమాన గౌరవం ఇవ్వాలని వారిని గౌరవించాలని తెలిపారు. ప్రబోధించిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని,ఆయుర్వేదం పట్ల అవగాహన ఉండడం వల్ల ప్రకృతి వైద్యంతో అనేక మందిని రోగాల నుండి విముక్తి కలిగించారని అన్నారు.
నగరంలో బంజారాల కోసం సంత్ సేవాలాల్ ఆలయ నిర్మాణంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్, మేయర్ లతో చర్చించి ఏర్పాటుకు సహకరిస్తామని అన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణ క్రమంలో అక్కడే సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని, బంజారాలకు గిరిజనులకు రెండు పడకల గదుల ఇళ్ళను అందజేయడానికి బంజారా ప్రతినిధులు రాతపూర్వకంగా వినతి పత్రం అందచేయగా పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. గతంలో ఖమ్మం రోడ్డు ప్రాతంలో విగ్రహం దొంగిలించబడిన విషయంలో.. అట్టి చర్యకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని ఏసీపీని మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. సంత్ సేవాలాల్ కేవలం బంజారాలకే కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం సేవలు అందించారని కొనియాడారు. సంపద కంటే సంస్కారం ముఖ్యమని, అధికారం కంటే ఆదర్శం ప్రధానమని సూచించారని మేయర్ అన్నారు. ఈ సందర్భం గా బంజారా ప్రతినిధులు మంత్రి, మేయర్ అధికారులు కార్పొరేటర్ లు మీడియా ప్రతినిధులను బంజారాల సంప్రదాయ తలపాగాలను ధరింపజేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు పోశాల పద్మ, ఓని స్వర్ణలత భాస్కర్, వస్కుల బాబు, బాల్నే సురేష్, చింతాకుల అనిల్ కుమార్, ఆర్డీఓ సుమ, ఏసీపీ శుభం, ట్రైనీ ఐపీఎస్ మనీషా, వరంగల్ ఎమ్మార్వో శ్రీకాంత్, బంజారా ప్రతినిధులు మోతీ నాయక్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.














