స్పోర్ట్స్ డెస్క్ : వరల్డ్ కప్ గెలిస్తేనే గొప్ప ఆటగాళ్లుగా, వరల్డ్ కప్ గెలువనంత మాత్రాన చెడ్డ ఆటగాళ్లుగా జమకట్టలేమని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఒమన్ లో ఉన్న ఆయన ఓ నేషనల్ మీడియా సంస్థతో మాట్లాడారు. దేశానికి చెందిన గొప్పగొప్ప క్రికెటర్లు వరల్డ్ కప్ గెలువాలన్న తమ కల నెరవేరకుండానే రిటైర్ అయ్యారని ఆయన గుర్తు చేశారు. భారత దిగ్గజ క్రికెటర్ కు 6 వరల్డ్ కప్ లు ఆడితే కేవలం ఒక్క వరల్డ్ కప్ లో విజయం దక్కిందని రవిశాస్త్రి గుర్తు చేశారు.
గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి ఎంతో మంది గొప్ప ఆటగాళ్లకు వరల్డ్ కప్ గెలువాలన్న కల నెరవేరలేదన్నారు. అంతమాత్రాన వాళ్లను చెత్త ఆటగాళ్లుగా అంచనా వేయలేమని ఆయన వెల్లడించారు.ఒక ప్లేయర్ తన కెరియర్ లో ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చాడన్న దానిపై అతని గొప్పతనం ఆధారపడి ఉంటుందని రవిశాస్త్రి తెలిపారు. తాను దాదాపు ఏడేండ్లు టీమిండియా హెడ్ కోచ్ గా పనిచేసినట్లు చెప్పారు. ఎవరు ఎలా ఆడుతారో నాకు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఐనా తన ఆటగాళ్ల గురించి తాను పబ్లిక్ లో చర్చించదలుచుకోలేనని రవిశాస్త్రి తెలిపారు.














