ఏపీ హైకోర్టు నిర్మాణంలో రికార్డ్
వరంగల్ టైమ్స్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నవరాజధాని అమరావతిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్మాణంలో అత్యంత కీలకమైన రాఫ్ట్ ఫౌండేషన్ పనుల్లో భాగంగా తాజాగా 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ రూపొందించిన డిజైన్లతో ఈ భవనం రూపుదిద్దుకుంటోంది. ఈ భారీ నిర్మాణ ప్రక్రియను ఏపీసీఆర్డీఏ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పని వేగవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో 8 అత్యాధునిక బూమ్ ప్రెజర్ మిషన్లు, దాదాపు 600 మందికి పైగా నైపుణ్యం కలిగిన కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. బేస్‌మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తుల నమూనాలో నిర్మిస్తున్న ఈ భవనానికి పటిష్టమైన పునాది వేసేందుకు ఇంజనీర్లు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారు.
మిగిలిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ నాటికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు పూర్తిగా పూర్తయితే, భవన పైనిర్మాణం మరింత వేగంగా సాగడానికి మార్గం సుగమం అవుతుంది. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనంలో 52 కోర్టు హాళ్లు ఉండనున్నాయి. చీఫ్ జస్టిస్ కోర్టు ఎనిమిదో అంతస్తులో ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.అమరావతిలోని ఏడు ఐకానిక్ కట్టడాలలో హైకోర్టు అత్యంత కీలకమైనది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 45,000 టన్నుల స్టీల్‌ను వినియోగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ప్రకారం 2027 చివరి నాటికి ఈ శాశ్వత హైకోర్టు భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి యంత్రాంగం కృషి చేస్తోంది.














