నాగలి దున్ని, నాటేసిన మంత్రి ఎర్రబెల్లి

నాగలి దున్ని, నాటేసిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : రైతు బిడ్డ పొలాన్ని చూస్తే మురుస్తాడు. వ్యవసాయం చూస్తే ఉరకలేస్తాడు. తోటోళ్లు పొలం పనులు చేస్తుంటే తను ఆగలేడు. అతనెవరో కాదు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసి, వెంటనే పొలంలోకి దూకాడు. గొర్రు పట్టి ఎడ్లను సై అన్నాడు. అరకపట్టి పొలం దున్నారు. అందరితో కలిసి గొంతు కలిపి నాట్లు వేసి హౌరా అనిపించారు.నాగలి దున్ని, నాటేసిన మంత్రి ఎర్రబెల్లితెలంగాణలో మాస్ ఫాలోయింగ్ ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులు చేయడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అయితే ఎంత వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కొందరు తమ హోదా ఎక్కడ తక్కువవుతుందోనని వ్యవసాయ పనుల వైపు కన్నెత్తి కూడా చూడరు. అలాంటిది మంత్రి దయాకర్ రావు మాత్రం ఢిల్లీకి రాజు అయినా, తల్లికి కొడుకే అన్న చందంగా రాష్ట్రానికి మంత్రి అయినా.. రైతు బిడ్డే అని విషయాన్ని మాత్రం మరిచిపోడు.

ఇందులో భాగంగానే వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లి రైతుగా మారాడు. పొలం పక్కన ఉన్న రైతులతో కాసేపు మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలతో కలసి నాట్లు వేసి వారితో ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల స్థితి గతులు ఎలా ఉన్నాయని, వ్యవసాయం ఎలా సాగుతుందని భూముల రేట్లు ఏ విధంగా ఉన్నాయని ఆరా తీశారు. స్వయంగా మంత్రి తమతో కలిసి పొలం పనుల్లో పాల్గొనడం పట్ల అక్కడి రైతులు ఒకింత ఆశ్చర్యానికి , ఆనందానికి లోనయ్యారు.