ఆ దేశాన్ని వణికిస్తున్న కరోనా 

ఆ దేశాన్ని వణికిస్తున్న కరోనా

వరంగల్ టైమ్స్, ఇంటర్నేషనల్ డెస్క్ : చైనాలో కరోనా మారణహోమం సృష్టిస్తోంది. నిత్యం వేల మంది కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని వార్తలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నా గత వారం రోజుల్లో కేవలం ఒకే ఒక్క మరణం చోటుచేసుందని చైనా ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో శ్మశానాల వద్ద భయానక పరిస్థితులు ఉన్నాయని.. మృతదేహాలతో కుటుంబీకులు బారులు తీరిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనాలో కొవిడ్‌ మరణాల పరిస్థితిని తెలియజేస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్‌ ఫీగల్‌ డింగ్‌ షేర్‌ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఆ దేశాన్ని వణికిస్తున్న కరోనా 

చైనాలో కరోనా వైరస్‌ తీవ్రతపై ఆయన వరుస ట్వీట్‌లలో వివరించారు. ‘మృతదేహాలతో శ్మశానాల వద్ద బారులు తీరిన కుటుంబీకులు.. గంటలపాటు వేచిచూస్తున్న దారుణ పరిస్థితి. మరోవైపు ఆస్పత్రి మార్చురీలు నిండిపోయి.. కారిడార్లలోనే వరుసగా పెట్టిన మృతదేహాలు కనిపిస్తున్నాయ్‌ ‘ అని పేర్కొంటూ అందుకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి అక్కడ 20లక్షల కోవిడ్‌ మరణాలు సంభవించవచ్చనే అంచనాలకు తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ప్రతీ నగరంలో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య లక్షల్లో ఉంటోందని చెబుతున్నాయి.

కోవిడ్‌కు సంబంధించిన సమాచారం ఇలా బయటకు వస్తుంటే.. చైనా అధికారిక లెక్కలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జీరో కొవిడ్‌ ఆంక్షలు ఎత్తివేసిన డిసెంబర్‌ 7 తర్వాత కేవలం ఏడుగురు మాత్రమే కొవిడ్‌తో మరణించారని అధికారికంగా వెల్లడించింది. ఇలా గత మూడేళ్ల నుంచి ఇప్పటివరకు మొత్తంగా 5241 మంది మాత్రమే చనిపోయినట్లు పేర్కొనడం గమనార్హం. ఇలా మరణాల సంఖ్యను గణించకపోవడం, తక్కువ చేసి చూపడం పట్ల ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కచ్చితమైన సమాచారం ఇవ్వాలంటూ చైనాకు సూచించింది.