జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపువరంగల్ అర్బన్ జిల్లా: రానున్న గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, బల్దియాపై కాషాయం జెండా ఎగురవేయడం ఖాయమని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలలో బీజేపీ భారీ గెలుపును సాధించిన సందర్భంగా రావు పద్మ ఆధ్వర్యంలో హన్మకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఢంకా బజాయిస్తూ , టపాసులు పేల్చుకుంటూ విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. హంటర్ రోడ్డులోని బీజేపీ కార్యాలయం నుంచి అదాలత్ లోని అమరవీరుల స్థూపం వరకు కాషాయపు జెండాలతో ర్యాలీగా తరలివచ్చి అమరులకు నివాళులర్పించారు. అనంతరం రావు పద్మ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై,కేసీఆర్ కుటుంబ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో కేసీఆర్ కుటుంబం సాగిస్తున్న అవినీతి, అరాచక పాలనకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ఆమె అన్నారు. ఈ దెబ్బతో తెలంగాణ అభివృద్ధికి బీజేపి జాతీయ నాయకత్వం అండగా వుంటుందని ప్రజలు విశ్వసించారని అన్నారు. బీజేపీకి అండగా నిలిచిన ప్రజలకు, కష్టపడి పనిచేసిన నాయకులకు రావు పద్మ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవం కొరకు ప్రజల తరుపున బీజేపి తన పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. అమరవీరుల ఆశయం సాధన కొరకు, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని, వచ్చే జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో బల్దియా పీఠంపై కాషాయం జెండా ఎగురవేయడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పులి సరోత్తం రెడ్డి, రత్నం సతీష్ షా, వరంగల్ అర్బన్ జిల్లా నాయకులు కొలను సంతోష్ రెడ్డి, దేశిని సదానందం గౌడ్, బాకం హరి శంకర్, సంగని జగదీశ్వర్, మండల సురేష్, పషికంటి రాజేంద్ర ప్రసాద్, మందాటి వినోద్, గుండమీది శ్రీనివాస్, రాంకీ యాదవ్, సుమన్ ఖత్రీ, సిద్దం నరేశ్, కుచాన క్రాంతి, కేతిరెడ్డి విజయలక్ష్మి, పోరిక రాజు, అల్లం నాగరాజు, అనిశెట్టి రంజిత్, అనురాధ, తిరుపతి, సధి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.