రైతు సంఘాల చర్చలు అసంపూర్ణం

రైతు సంఘాల చర్చలు అసంపూర్ణంన్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న మరో విడత చర్చలు జరుపనున్నది. శనివారం జరిగిన ఐదో విడత చర్చలో ప్రభుత్వ వైఖరిలో కొంత పురోగతి కనబడింది. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తుండగా సవరణలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చినట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చర్చల్లో అనిశ్చితి కొనసాగుతున్నది. ఒక ప్రతిపాదనను పంపుతామని కేంద్ర ప్రభుత్వం తమకు తెలిపిందని చర్చల అనంతరం రైతు సంఘాల నేతలు చెప్పారు. ఆ ప్రతిపాదనపై తమతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించిన తర్వాత ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ఒక సమావేశాన్ని నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించిందని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరపైనా చర్చ జరిగిందని, విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకునే అంశంపై మాట్లాడాలని తాము చెప్పినట్లు భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ తికైత్ తెలిపారు. ప్రకటించిన మాదిరిగానే ఈనెల 8న భారత్ బంద్ వుంటుందని అన్నారు.