ఐటీ పరిశ్రమను విస్తరింపచేస్తాం: కేటీఆర్

ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు వేగంగా చర్యలు
ఐటీ , పరిశ్రమల శాఖలపై మంత్రి కేటీఆర్​ సమీక్ష
ఈ నెల 7న ఖమ్మం ఐటీ టవర్ ప్రారంభోత్సవంఐటీ పరిశ్రమను విస్తరింపచేస్తాం: కేటీఆర్హైదరాబాద్​: ఐటీ పరిశ్రమను తెలంగాణలో అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుతం వేగంగా చర్యలు చేపడుతోంది. శనివారం ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ ఈ రెండు శాఖల కార్యక్రమాలపైన ప్రగతి భవన్​లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో పాటు టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు హాజరయ్యారు. ఇప్పటికే మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపిన మంత్రి ఎల్లుండి ఖమ్మం పట్టణం లోనీ ఐటీ టవర్ ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రెండో దశలో మరిన్ని ఐటీ కంపెనీలు వరంగల్ నగరంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన మౌలిక వసతులను, ఇతర సదుపాయాలకు సంబంధించి టీఎస్ఐ ఐ సీ చేపడుతున్న కార్యాచరణ పైన మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకటి రెండు ప్రముఖ కంపెనీలు త్వరలోనే వరంగల్ నగరానికి వస్తాయని అన్నారు. ఇందుకు సంబంధించి ఆయా కంపెనీలతో తెలంగాణ ఐటీ శాఖ చర్చలు నిర్వహిస్తుందని వాటికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు హైదరాబాద్ మహానగరంలోనూ ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రోత్ ఇన్ డిస్ పర్షన్ (గ్రిడ్) పాలసీకి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల్, నాచారం వంటి ఇండస్ట్రియల్ ఏరియా లో ఐటీ పార్కుల నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న కార్యాచరణను తెలుసుకున్నారు. కంపెనీలు, ఐటీ పార్కులను నిర్మాణం చేసేందుకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని ప్రభుత్వం తరఫున ఆయా కంపెనీలకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్​కుమార్​ను ఫోన్ లో మంత్రి కోరారు. దీంతోపాటు కొంపల్లి ప్రాంతంలో ఒక ఐటీ పార్క్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ ఐఐసీ ఎండీ నరసింహా రెడ్డి కి మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లా రెవెన్యూ యంత్రాంగం తో పాటు హెచ్ఎండీఎ సహకారంతో కొంపల్లిలో ఐటీ పార్క్ కు సంబంధించిన స్థల గుర్తింపు జరిగిందన్నారు. త్వరలోనే అక్కడ శంకుస్థాపన మంత్రి కేటీఆర్​కు తెలియజేశారు. దీంతో పాటు మహబూబ్​నగర్ దివిటిపల్లి ప్రాంతంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. పరిశ్రమల శాఖ ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో అగ్రస్థానాన్ని సాధించేందుకు కసరత్తు చేస్తుందని పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్ రాజ్ మంత్రికి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలతో పాటు ఇక్కడి నాయకత్వం పరిశ్రమలు మరియు పెట్టుబడుల ఆకర్షణకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సాంకేతిక అంశాల వల్ల గత సంవత్సరం తక్కువ ర్యాంకు వచ్చిన నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కు మంత్రి కేటీఆర్ సూచించారు.  ఈ మేరకు ఇతర శాఖల సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సారి కచ్చితంగా ఈసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్​లో మంచి స్థానాన్ని సంపాదిస్తామని ఆయన కేటీఆర్​కు తెలిపారు.