జనవరి ​నుంచి నూతన ఇసుక పాలసీ

జనవరి ​నుంచి నూతన ఇసుక పాలసీగుడివాడ‌ : రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చేందుకు వ‌చ్చే ఏడాది జనవరి ఫస్ట్​నుంచి నూతన ఇసుక పాలసీ అమల్లోకి రానుందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం గుడివాడ పట్టణంలోని ది గుడివాడ భవన నిర్మాణ తాపీ కార్మిక సంఘం భవన ప్రారంభానికి ఆయన హాజరయ్యారు. కొత్త పాలసీ ప్రకారం రీల్లో ఇసుకను ఎంత అమ్మాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. టన్ను ఇసుకను తరలించడానికి కిలోమీటరుకు రూ.5 చొప్పున కిరాయి ఖర్చు, అలోడింగ్, లోడింగ్‌కు రూ.50 చొప్పున భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇసుక విక్రయాలకు సంబంధించి కమిటీ సలహాదారుడిగా ప్రభుత్వానికి సలహాలు చేస్తున్నానన్నారు. కొత్త విధానంలో ఆన్​లైన్​ బుకింగ్ ఉండదని బ్లాక్‌మార్కెట్‌కు ఇసుక తరలిపోదన్నారు. ఇసుక కొనుగోలుదారులు ఏ రీచ్‌లో కావాలనుకుంటే అక్కడే కావాల్సినంతగా ఇసుకను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. గుడివాడ ప్రాంతంలో రూ.750 టన్ను ఇసుక సరఫరా అయ్యేలా చూస్తామన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్న దృఢ సంకల్పంతో సీఎం జగన్​ పనిచేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూర్​ జయరాం అన్నారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మంత్రులు కొడాలి నాని, గుమ్మనూర్ జయరాంలను సత్కరించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు సనకా సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.