ప్రీతి మృతి కేసులో కీలకంగా ఫోరెన్సిక్ రిపోర్టు

ప్రీతి మృతి కేసులో కీలకంగా ఫోరెన్సిక్ రిపోర్టు

ప్రీతి మృతి కేసులో కీలకంగా ఫోరెన్సిక్ రిపోర్టువరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : తెలంగాణలో సంచలనం రేపిన వరంగల్‌ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసులో పోలీసులు వేగం పెంచారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నం కాదని, సైఫ్ హత్య చేశాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రీతి గూగుల్‌లో సెర్చ్ చేసి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుందని పోలీసులు చెబుతుండగా.. సైఫ్‌నే పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి పక్కా ప్లాన్ తో హత్య చేసేందుకు ప్రయత్నాలు చేశాడని తండ్రితో పాటు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తండ్రి ఆరోపణలతో పోలీసులు కూడా హత్యా? ఆత్మహత్యా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తోన్నారు. నేడు దీనికి కాస్త క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ వరంగల్ పోలీసులకు అందింది. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం ఆధారంగా ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్టు సిద్దమైంది. ప్రీతి బ్లడ్ శాంపిల్స్ రిపోర్టును కూడా పోలీసులు తీసుకున్నారు. దీంతో నేడు ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్టును పోలీసులు బయటపెట్టే అవకాశముంది.

ప్రీతిది హత్యా? లేదా ఆత్మహత్య? అనే అనుమానాలకు ఫోరెన్సిక్ రిపోర్ట్ తెరదించనుంది. తమ కూతురిని సైఫ్ హత్య చేశాడని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తండ్రి చెబుతున్నాడు. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు కూడా పంపానన్నాడు. ప్రీతికి ఇంజెక్షన్ ఇచ్చి చనిపోయిందనకుని సైఫ్ వెళ్లాడని, అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని తోటి సిబ్బంది హాస్పిటల్‌కు తరలించినట్లు చెబుతున్నారు. దీంతో ఫోరెన్సిక్ రిపోర్టు కీలకంగా మారింది. ప్రీతి బాడీలోని ఇంజెక్షన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. అది ఏమి ఇంజెక్షన్ అనేది వైద్యులు కానీ పోలీసులు కానీ బయటపెట్టలేదు. ప్రమాదకరమైన ఇంజెక్షన్ అని చెబుతున్నా, ఆ ఇంజెక్షన్ పేరు ఏంటనేది బయటకు రాలేదు.

ఫోరెన్సిక్ రిపోర్టులో వివరాలన్నీ ఉండే అవకాశముందని చెబుతున్నారు. ప్రీతి ఆత్మహత్య కేసులో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదట త్తిడితోనే ప్రీతి చనిపోయినట్లు కాలేజీ యాజమాన్యం చెప్పగా, ఆ తర్వాత విద్యార్థి సంఘాల ఆందోళనలతో సైఫ్ వేధింపుల వల్ల చనిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. సైఫ్ వేధింపుల గురించి తల్లిదండ్రులకు ప్రీతి ముందే చెప్పడం, సైఫ్ వాట్సప్ మెసేజ్‌లు బయటపడటంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సైఫ్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రీతి వాట్సప్ ఛాటింగ్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్, ఆడియో కాల్స్ ఆధారంగా సైఫ్‌ను లోతుగా విచారిస్తున్నారు. సుదీర్ఘంగా అతడిని అన్ని విషయాలు అడుగుతున్నారు. సైఫ్ విచారణలో పలు కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. వాటిని త్వరలో పోలీసులు బయటకు వెల్లడించే అవకాశముంది. ఈ క్రమంలో ఫోరెన్సిక్ రిపోర్టు అత్యంత కీలకంగా మారిందని చెప్పవచ్చు.