మిస్టరీగా ప్రీతి మృతి కేసు..హత్యే కారణమా ?

మిస్టరీగా ప్రీతి మృతి కేసు..హత్యే కారణమా ?

మిస్టరీగా ప్రీతి మృతి కేసు..హత్యే కారణమా ?వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : మెడికో ప్రీతి మృతి ప్రస్తుతం మిస్టరీగా మారింది. ప్రీతి శరీరంలో ఎలాంటి పాయిజన్ లేదని టాక్సికాలజీ రిపోర్టులో బయటపడటం కీలకంగా మారింది. దీంతో ప్రీతి మృతికి కారణం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హత్య చేశారంటూ తల్లిదండ్రులతో పాటు ప్రతిపక్ష పార్టీలు గత కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో టాక్సికాలజీ రిపోర్టు అనేక అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో నేడు డీజీపీతో వరంగల్ సీపీ భేటీ కానున్నారు.

తెలంగాణలో కలకలం రేపిన వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రీతి మృతి సంచలనం రేపడంతో ఈ కేసులోని పరిణామాలపై అందరి దృష్టి పడింది. ఆత్మహత్యాయత్నం అని పోలీసులు కేసు నమోదు చేయగా ఇది హత్య అంటూ తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.

ఈ క్రమంలో సోమవారం ప్రీతి కేసుపై చర్చించేందుకు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ను హైదరాబాద్‌లో వరంగల్ సీపీ రంగనాథ్ కలవనున్నారు. ఈ భేటీతో ప్రీతి మృతి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీతి మృతికి సంబంధించి ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆదివారం వరంగల్ సీపీకి ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ అందింది. ప్రీతి శరీరంలో ఎలాంటి విషపదార్ధాలు లేవని ఈ రిపోర్టు ద్వారా తేటతెల్లమైంది.

ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఇప్పటి వరకు పోలీసులు చెబుతూ వచ్చారు. కానీ ప్రీతి శరీరంలో ఎలాంటి రసాయనాలు లేవని రిపోర్టులో పేర్కొడంతో అనుమానాస్పద మృతిగా కేసును మార్చే అవకాశముంది. డీజీపీతో భేటీ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే నిందితుడు డాక్టర్ సైఫ్ నాలుగు రోజుల కస్టడీ ముగియడం, ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో డీజీపీతో వరంగల్ సీపీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

సైఫ్ కస్టడీ ముగియడంతో నేడు అతడిని వరంగల్ కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఖమ్మం జైలుకు తరలించే అవకాశముంది. ప్రీతి శరీరంలో ఎలాంటి మత్తు పదార్థాలు లేవని తేలడంతో ఎలా చనిపోయిందనేది పోలీసులకు అసలు అంతుచిక్కడం లేదు. దీంతో హత్య చేసి ఉంటారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తోన్నారు. ప్రీతిది ఆత్మాహత్యాయత్నం కాదని, హత్య అంటూ తొలి నుంచి తండ్రి నరేందర్ చెబుతూ వస్తున్నాడు.

అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రీతిది హత్యేనంటూ ఆరోపిస్తున్నాయి. దీంతో పోలీసులపై ఒత్తిడి మరింత పెరిగింది. ప్రీతి హాస్పిటల్‌లో అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించినప్పుడు ఘటనా స్థలంలో మత్తు ఇంజెక్షన్లు లభించినట్లు పోలీసులు ఇంతకు ముందు ప్రకటించారు. కానీ ఆమె శరీరంలో అలాంటి అవశేషాలే లేవని రిపోర్ట్ రావడంతో ప్రీతి మృతికి కారణం ఏంటనేది మిస్టరీగా మారింది. దీంతో ప్రీతిది ఆత్మహత్యనా ? లేదా హత్యనా ? అనేది తేల్చాలని రాజకీయ పార్టీలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నాయి.