తెలంగాణ గోస తీర్చిన ధీరుడు కేసీఆర్: దాస్యం
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: కేసీఆర్ 72 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ గోత్ర నామాలతో వారి కుటుంబ సభ్యుల పేరిట అర్చనలు చేశారు. అనంతరం దేవాలయ ఎదుట ఉన్న నిరుపేదలకు దుప్పట్లు పంచిపెట్టారు. అదే విధంగా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు.ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థులు ఇద్దరి ఫీజులు చెల్లించి వారికి రశీదులు అందజేశారు. దివ్యాంగులు నిర్వహించిన కేసీఆర్ జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ముమ్మాటికీ కేసీఆర్ సారే తెలంగాణ జాతిపిత అని, 60 ఏండ్ల గోస తీర్చిన ఉద్యమ కెరటం కేసీఆర్ అని వారు కొనియాడారు.14 ఏండ్ల స్వరాష్ట్ర పోరాటం, 10 ఏండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని, కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం అభివృద్ధి అందాయని తెలిపారు.














