ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు: ఎర్రబెల్లి

ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు: ఎర్రబెల్లివరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ తో కలిసి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 145 మంది లబ్ధిదారులకు రూ. 1.45 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి యువత పెళ్లిళ్లకు రూ.1,00116 అందిస్తూ సీఎం కేసీఆర్ మేనమామలా అండగా నిలుస్తున్నారని మంత్రి దయాకర్ రావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ తరహా పథకాలు లేవన్నారు. ఆయా ప్రభుత్వాలు మన పథకాలను అమలు చేయాలని చూస్తున్నాయన్నారు.

ఓ వైపు కేంద్రమంత్రులు, అధికారులు రాష్ట్రాన్ని అభినందిస్తున్నారని, మరో వైపు రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని తెలిపారు. ఇదెక్కడి న్యాయం, ఇదేం విధానం అంటూ ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చిచెప్పిందని, బియ్యం కొనుగోలులో కోతలు పెట్టిందని పేర్కొన్నారు. రూ.30 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకున్నారన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కేంద్రం చెప్పిందని అన్నారు. అయినా బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులకు చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అందరికీ నీళ్లిస్తున్నామని వెల్లడించారు.