వేయిస్తంభాల ఆలయంలో మహాశివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
-జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: చరిత్ర ప్రసిద్ధిగాంచిన రుద్రేశ్వర స్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనివారం మహాశివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆగమానుసారంగా ప్రారంభమైనాయి. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ మంగళ వాయిద్య సేవ ఉత్తిష్ఠ గణపతికి హరిద్ర కుంకుమ విలేపణ అభిషేకం, రుద్రేశ్వర స్వామికి ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామి వార్లను నంది వాహనంపై మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో ఎదురుకోలు నిర్వహించి రుద్రేశ్వరునికి ఎదురుగా సూర్యాలయంలో ఆది దంపతులను ప్రతిష్టించారు.
గణపతి నవగ్రహ అష్టదిత్పాలక పూజలు నిర్వహించి పుణ్యావాచన రుత్వికరణ పాలిక పూజ అంకురారోపణ షోడా శోపచార పూజల చేశారు. పుష్పార్చన పంచగవ్యములతో దేవాలయ ప్రాంగణమంతా శుద్ధి మంత్రం నిర్వహించి నీరాజనం మంత్రపుష్పములు నివేదనలు సమర్పించారు. అనంతరం స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఆయన సతీమణి నీలిమ, గోదా విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు ఉమామహేశ్వరి, రామ్ రెడ్డి, తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ 5 రోజులపాటు జరిగే పంచాన్నిక దీక్ష ఉత్సవాలను, బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. తదనంతరం ఆలయ ప్రాంగణంలో యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన గణపతి నవగ్రహ పంచసూక్తములతో జయాధి హోమాలతో 18 అధ్యాయంలతో లోక కళ్యాణార్థం తెల్ల ఆవాలు, తోక మిరియాలు, ఇప్పపువ్వు, రక్త చందనం, సుగంధ ద్రవ్య పరిమళ ద్రవ్యములతో మహా చండీయాగం నిర్వహించారు.
ఆలయ కార్యనిర్వాహణ అధికారి డి. అనిల్ కుమార్ పర్యవేక్షించారు. వేద పండితులు భరత్ శర్మ, శ్రీమాన్నారాయణ, ప్రధ్యుమ్న శర్మ, గంగు మణికంఠ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ పర్యవేక్షణలో వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం మహాశివరాత్రి మహా పర్వదినం ఉదయం తెల్లవారుజామున 3.30 గంటలకు మంగళ వాయిద్య సేవ ఉత్తిష్ఠ గణపతి కి అభిషేకం రుద్రేశ్వరునికి ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించి ఉదయం 5 గంటల నుండి సామూహిక రుద్రాభిషేకములు రాత్రి 10 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 5.45 నిమిషాలకు ఉత్తరాషాడ నక్షత్ర యుక్త సింహ లగ్న సుముహూర్తమున శ్రీ రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుందని ప్రధానార్చకులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు.
రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో 12 మంది వేద పండితుల ఆధ్వర్యంలో పాశుపత పూర్వక మహా రుద్రాభిషేకం నమక చమకాలతో రుద్ర ఆధ్యాయంతో 111 రుద్రములతో, 101 లీటర్ ఆవుపాలతో, 51 కిలోల ఆవు పెరుగుతో, 21 కిలోల పుట్ట తేనెతో, 11 కిలోల ఆవు నెయ్యితో, పండ్ల రసములతో మహా రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. శివ ప్రీతికరమైన సోమవారం కూడా లింగోద్భవ కాల పూజ కలిసి వస్తుంది కాబట్టి జాగరణ ఉండే భక్తుల కొరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు.














