బాధితులకు భారాస భరోసా

బాధితులకు భారాస భరోసా

-ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూల్చడమేనా..
-వెలుగుమట్ల బాధితులకు భరోసాగా నిలిచిన కేటీఆర్
-కూల్చిన చోటే ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకున్న బీఆర్ఎస్
-కూల్చివేతలపై సుప్రీం కోర్టు వరకు పోరాటం చేస్తాం
-ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ పరామర్శబాధితులకు భారాస భరోసావరంగల్ టైమ్స్, ఖమ్మం జిల్లా: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. ఖమ్మం వెలుగుమట్లలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ఇళ్ల కూల్చివేత బాధితులను గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిన “ఇందిరమ్మ రాజ్యం”లో.. ఉన్న ఇళ్లను కూలగొట్టడం అన్యాయమని ధ్వజమెత్తారు. ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు, కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, కనీస నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం అమానుషమని ఆయన విమర్శించారు. ఖమ్మంలో 150 ఇళ్లతో పాటు, మహబూబ్ నగర్‌లో దివ్యాంగుల ఇళ్లను కూడా కూల్చివేయడం ఈ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. కేవలం ఆర్డీవోను బదిలీ చేస్తే సరిపోదని, బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కూల్చివేతకు గురైన కుటుంబాలకు కేటీఆర్ అండగా నిలిచారు. “మీరు ఎవరు అధైర్యపడకండి, ఏడవకండి.. మీ అందరికీ మళ్ళీ ఇదే స్థలంలో ఇళ్లు కట్టించి, గృహప్రవేశాలు చేయించే బాధ్యత నాది” అని ఆయన హామీ ఇచ్చారు.బాధితులకు భారాస భరోసాఈ పోరాటంలో భాగంగా కలెక్టర్, చీఫ్ సెక్రటరీలను కలిసి బాధితుల పక్షాన నిలబడతామని చెప్పారు. శాసనసభ, శాసనమండలి వేదికలుగా ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పేదల పక్షాన పోరాడాలని కేసీఆర్ ప్రత్యేకంగా చెప్పారని, బాధితులు ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు. ప్రభుత్వం బాధితులను విడదీసే ప్రయత్నం చేస్తుందని, కానీ అందరూ కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధించగలమని కేటీఆర్ సూచించారు. కలెక్టర్ తమతో అబద్ధాలు చెప్పారని బాధిత మహిళలు ఫిర్యాదు చేయగా, అధికారులు, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడతామని ఆయన భరోసా ఇచ్చారు. చట్టపరమైన అన్ని ఆధారాలు బాధితుల వైపు ఉన్నాయని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ వారికి ధైర్యాన్ని ఇచ్చారు.బాధితులకు భారాస భరోసాఇదిలా ఉండగా ఇళ్ల కూల్చివేత బాధితుల పరామర్శలో హృదయవిదారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. బాధితులు తమ కన్నీళ్లను ఆపుకుంటూ, తమ వద్ద ఉన్న భూమి పట్టా కాగితాలు, ప్రభుత్వానికి కట్టిన ఆస్తి పన్ను రశీదులు, ఇంటి పన్ను కాగితాలు మరియు కరెంట్ కనెక్షన్ కోసం కట్టిన డీడీలను కేటీఆర్ కి చూపించారు. అన్నా అన్నా అంటూ చేతులెత్తి కేటీఆర్ కు మొక్కారు. ఇవన్నీ ప్రభుత్వమే ఇచ్చిన కాగితాలు కదా, మరి మా ఇళ్లను ఎలా కూలుస్తారు అంటూ వారు తమ ఆవేదనను కేటీఆర్ ముందు వెళ్లగక్కారు., గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జీవోల ప్రకారం దరఖాస్తు చేసుకుని, ఎలాంటి ఇబ్బంది లేకుండా నివసిస్తున్న తమను, రేవంత్ సర్కార్ అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా ఖాళీ చేయించిందని వారు వాపోయారు.