వలస కార్మికు కోసం సోనూ మరో అడుగు ముందుకు
వరంగల్ టైమ్స్, ముంబై : వలస కార్మికుల బాధలని అర్ధం చేసుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రతి ఒక్కరిని వారి వారి స్వస్థలాలకి చేర్చాలని ఎంతగానో తాపత్రయపడుతున్నాడు. ఇప్పటికే బస్సులు, రైళ్ళ ద్వారా కొందరిని తరలించిన సోనూ ఇటీవల కొచ్చి నుండి భువనేశ్వర్‌కి ప్రత్యేక ఫ్లైట్ ద్వారా దాదాపు 150 మందిని సొంత గూటికి చేర్చారు. ఆపత్కాలంలో తమకి అండగా నిలిచిన సోనూని వారందరు దేవుడిగా కొలుస్తున్నారు. తాజాగా ముంబై నుంచి ఉత్తారాఖండ్‌లోని డెహ్రాడూన్‌కి వెళ్ళేందుకు ఎయిర్ ఏషియాకి చెందిన విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లైట్‌లో 173 మంది వలస కార్మికులని వారి ప్రాంతానికి పంపించాడు. కష్టాలలో ఉన్న వారికి అండగా ఉండడం తనకి సంతోషాన్ని కలిగిస్తుందంటున్నాడు సోనూ. వలస కార్మికులలో చాలా మందికి ఎప్పుడూ విమాన ప్రయాణం చేసే అవకాశం రాదు, వారి కుటుంబాలని, స్నేహితులని కలుసుకునేందుకు ఎయిర్ ఏషియా ఇండియా విమానంలో ప్రయాణించినప్పుడు వారి ముఖాల్లో చిరునవ్వులు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి అన్నాడు. కరోనావైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నందున దేశంలోని వలస కార్మికుల సమూహాలు ఇంటికి తిరిగి రావడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి కోసం భవిష్యత్తులో మరిన్ని విమానాలను ఏర్పాటు చేయనున్నట్లు సోను సూద్ చెప్పారు.