హోంగార్డుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ ప్రైజ్

హోంగార్డుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ ప్రైజ్

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ హోంగార్డుకు సర్ ప్రైజ్ ఇచ్చారు. సాక్షాత్తు హై కోర్టు చీఫ్ జస్టిస్ తన వాహనాన్ని ఆపి , ఆ హోంగార్డుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే అష్రాఫ్‌ అలీ అనే హోంగార్డు అబిడ్స్‌ ట్రాఫిక్‌ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహం కూడలి వద్ద ఆయన విధులు నిర్వహిస్తుంటాడు. రోజూ అదే మార్గంలో సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ రాకపోకలు సాగిస్తుంటారు.హోంగార్డుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ ప్రైజ్ఈ క్రమంలో హోంగార్డు అష్రఫ్ అలీ పనితీరును చీఫ్ జస్టిస్ గమనించేవారు. హోంగార్డు అంకితభావంతో విధులను నిర్వహిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం సీజేను ఆకట్టుకుంది. దీంతో శుక్రవారం అదే మార్గంలో వెళ్తూ హోంగార్డును చూసి వాహనాన్ని ఆయన ఆపారు. అనంతరం హోంగార్డు అష్రాఫ్‌ అలీకి పుష్పగుచ్ఛం ఇచ్చి అతడి సేవలను అభినందించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ తనను అభినందించడం గర్వంగా ఉందని అష్రాఫ్‌ అలీ ఆనందం వ్యక్తం చేశారు. మరింత ఉత్సాహంగా తన విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. హోంగార్డును ట్రాఫిక్‌ విభాగం ఉన్నతాధికారులు అభినందించారు.