మా దయతోనే నువ్వు సీఎం అయ్యావు
-సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
-ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు
-ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి
-రేవంత్ రెడ్డి అహంకారపు మాటలకు ప్రజలే బుద్ది చెప్తారు
-చౌటుప్పల్ మున్సిపాలిటీ విజయోత్సవ ర్యాలీలో రాజగోపాల్ రెడ్డి
వరంగల్ టైమ్స్,చౌటుప్పల్: మేము కష్టపడితే రేవంత్ రెడ్డి సీఎం అయి, ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నాడని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేమందరం కలిసి కష్టపడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాంతో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాటలు విన్నప్పుడల్లా వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత గుర్తుకు వస్తుందని విమర్శించారు. తెలంగాణలో ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మనుషుల, ఆంధ్రా పెత్తందారుల పెత్తనమే నడుస్తుందని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం తనకు మర్యాదగా మంత్రి పదవి ఇస్తే సరేనని, లేదంటే డైరెక్ట్ గా సీఎంనే అవుతానని వ్యాఖ్యానించారు. అప్పుడు మునుగోడు నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి, తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూసుకుంటానని కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ఆయన అన్నారు. ఇది టీడీపీ కాంగ్రెసా? రాహుల్ గాంధీ కాంగ్రెసా? అర్థం కాని పరిస్థితికి రేవంత్ తీసుకొచ్చాడన్నారు. 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రేవంత్ రెడ్డి అహంకారంతో నేనే పదేళ్లు ముఖ్యమంత్రిని అని మాట్లాడుతుండటం ఆయన అహంకారానికి ప్రతీక అని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీతో టచ్ లో ఉండి, ఎవరి మద్దతుతో ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాడు? అని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డి నేనే పదేళ్లు ముఖ్యమంత్రిని అని అనడం రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని అవమానించడమేనని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ మంత్రులు, టీపీసీసీ ప్రెసిడెంట్, అధిష్టానం ఎందుకు ఏం అనడం లేదని ఆయన ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలకు కాంగ్రెస్ శ్రేణులంతా కేరింతలు కొట్టారు.
నిజానికి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ హై కమాండ్ హామీనిచ్చింది. అయితే రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఒక ఇంట్లో రెండు మంత్రి పదవులు ఇస్తే మిగతా నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందని కాంగ్రెస్ హై కమాండ్ సైలెంట్ అయింది. ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు గెలుస్తారు, గెలిచిన వారికి మంత్రి పదవి ఇద్దాం అన్న ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఆ హామీ ఇచ్చి ఉండొచ్చు. అయితే కేబినెట్ విస్తరణలో సైతం రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కలేదు. దీంతో తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంతే కాకుండా తాను ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, కబ్జాలు చేయడానికి రాలేదని కొందరు కాంగ్రెస్ నేతలనుద్దేశించి ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అయినా రేవంత్ రెడ్డి సైలెంట్ గానే ఉన్నారు. ఇక తాజాగా తనను మంత్రిని చేయకుంటే ముఖ్యమంత్రిని అవుతానంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ హై కమాండ్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే మరి.














