టైం ఇచ్చే వరకు వెయిట్ చేస్తాం

టైం ఇచ్చే వరకు వెయిట్ చేస్తాంన్యూఢిల్లీ : రైతుల ప్రయోజనం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేయడానికి కాదని తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమాలకర్ , ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావులతో కలిసి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కోరారు.

వీలైనంత త్వరగా సమయం ఇచ్చి తమ గోడు వినాలని విన్నవించారు. తమను నిరీక్షేంచేలా చేయడమంటే తెలంగాణ రైతులను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోసమే ఢిల్లీ వచ్చామని వారు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి భేటీకి సమయం ఇచ్చే వరకు వేచి చూస్తామని మంత్రుల బృందం పేర్కొంది.

గత యాసంగిలో కేంద్రం ఇచ్చిన టార్గెట్ ఎంత, కొన్నది ఎంత అని మీడియా ముఖంగా వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ ను పెంచాలని, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని గతంలోనే కోరామని తెలిపారు. వరి ధాన్యం 6 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వానాకాలం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 42 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇచ్చిందన్నారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని చెప్పారు. ఇంకా కొన్ని జిల్లాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పాత ఖమ్మం, పాత నల్లొండ, పాత పాలమూరులలోని కొన్ని నియోజకవర్గాలలో ఇంకా వరి కోతలు జరగవలసి ఉన్నదని అన్నారు. జనవరి 15 వరకు వరి కోతలు ఉంటాయన్నారు. ఇంకా 5 లక్షల ఎకరాలు వరి కోతకు సిద్ధంగా ఉందని తెలిపారు. నేటితో కేంద్రం ఇచ్చిన వరి ధాన్యం కొనుగోలు టార్గెట్ పూర్తవుతుందని పేర్కొన్నారు.

బియ్యం మిల్లింగ్ తర్వాత తరలించాల్సిన బాధ్యత కేంద్రానిదేనిన స్పష్టం చేశారు. ఇక ఇతర దేశాలకు ఎగుమతిపై రాష్ట్రాలకు అధికారం ఉండదని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇప్పటికే తెలంగాణలోని 12,600 పై చిలుకు గ్రామాలలో రైతులు నిరసనలు తెలుపుతున్నారన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వానాకాలం వరి ధాన్యం టార్గెట్, పెంచాలనేదానికి, రాబోయే యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలి అనే దానికి తేడా తెలియదని, వారికి అవగాహన లేక పొరపడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం వ్యవహారశైలి తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమేనని, వెంటనే పునరాలోచించి మంత్రుల బృందానికి సమయం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.