భారత్ లో వేగం పెంచిన ఒమిక్రాన్

భారత్ లో వేగం పెంచిన ఒమిక్రాన్న్యూఢిల్లీ : కరోనా నూతన వేరియంట్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. మహమ్మారి రూపాంతరం చెంది వేగంగా విస్తరిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఆదివారం మహారాష్ట్రలో 6, గుజరాత్ లో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 153కు చేరింది.

అధికారిక లెక్కల ప్రకారం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 54, ఢిల్లీలో 22, తెలంగాణలో 20, రాజస్థాన్ లో 17, గుజరాత్ లో 11, కేరళలో 11, ఆంధ్రప్రదేశ్ లో 1, చండీగఢ్ లో 1, తమిళనాడులో 1, పశ్చిమబెంగాల్ లో 1 చొప్పున రికార్డయ్యాయి.

ఒమిక్రాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ ఎంతో స్పీడ్ గా వ్యాప్తి చెందుతున్నదని పేర్కొంది. ఇప్పటికే 90 కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొంది.