నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు!
-ఆర్డీఎక్స్ లతో పేల్చేస్తామని మెయిల్..
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: నాంపల్లి క్రిమినల్ కోర్టులో బుధవారం ఒక్కసారిగా కలకలం రేగింది. కోర్టు భవనంలో బాంబులు పెట్టామని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఏకంగా 12 ఆర్డీఎక్స్ లతో కోర్టును పేల్చేయబోతున్నట్లు మెయిల్ లో పేర్కొన్నారు. దీంతో కోర్టులోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ బెదిరింపు నేపథ్యంలో పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. కోర్టు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్ ను, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. తనిఖీలు చేపట్టారు. కోర్టు భవనం మూలమూలలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఇది కేవలం ఆకతాయిల పనేనని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.













