కాంగ్రెస్ మాజీ ఎంపీకి భారీ ఊరట
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఊరట లభించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల అనుమానాస్పద మృతి కేసులో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాజయ్య, ఆయన భార్య మాధమి, కుమారుడు అనిల్ ( సారిక భర్త ), అనిల్ రెండో భార్య సనాను నిర్దోషులుగా ప్రకటించింది. బలమైన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. 2015 నవంబర్ 3 తెల్లవారుజామున హనుమకొండలోని రాజయ్య ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో కోడలు సారిక ( 35 ), మనుమళ్లు అభినవ్ ( 7 ), అయాన్ (3), శ్రీయాన్ (3) మృతి చెందారు. అత్తామామలు, భర్తతో మనస్పర్థలు నెలకొన్నట్లుగా కథనాలు వెలువడటంతో ఈ ఘటన రాజయ్య కుటుంబంపై అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసులో ఆమె భర్త అనిల్ ( ఏ1), మామ రాజయ్య (ఏ2), అత్త మాధవి (ఏ3)పై కేసు నమోదు చేశారు. నాలుగో నిందితురాలిగా అనిల్ రెండో భార్య సనాపైన కేసు నమోదైంది.