ముంబైకి నాలుగో ఓటమి..బెంగళూరు విక్టరీ
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐపీఎల్ 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబైకి రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (26) మంచి ఆరంభమే ఇచ్చారు. అయితే దాన్ని ఉపయోగించుకోలేకపోయిన ముంబై బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు.డెవాల్డ్ బ్రెవిస్ (8), తిలక్ వర్మ (0), కీరన్ పొలార్డ్ (0), రమన్ దీప్ సింగ్ (6) ఫెయిలయ్యారు. అయితే సూర్యకుమార్ యాదవ్ ( 68 నాటౌట్ ) అదరగొట్టడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బెంగళూరుకు అనూజ్ రావత్ (66), ఫాఫ్ డు ప్లెసిస్ (16) శుభారంభమే అందించారు. కెప్టెన్ డుప్లెసిస్ యాంకర్ పాత్ర పోషించగా అనూజ్ రెచ్చిపోయాడు.
డుప్లెసిస్ ఔటైన తర్వాత వచ్చిన కోహ్లీ (48) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 17వ ఓవర్లో దురదృష్టవశాత్తు రావత్ రనౌట్ అయ్యాడు. 19వ ఓవర్ మొదటి బంతికి కోహ్లీ ఎల్బీగా వెనుతిరిగాడు. రెండు పరుగుల దూరంలో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. కోహ్లీ ఔటవగానే క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ (8 నాటౌట్ ) వరుసగా రెండు బౌండరీలు బాది బెంగుళూరుకు విజయాన్ని కట్టబెట్టాడు. ముంబై బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్, డెవాల్డ్ బ్రెవిస్ చెరో వికెట్ తీసుకున్నారు. బెంగళూరు జట్టు 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.