“మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి”: రాష్ట్రపతి

"మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి": రాష్ట్రపతిన్యూఢిల్లీ : మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పష్టం చేశారు. బుధవారం రిపబ్లిక్‌ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి మంగళవారం రాత్రి సందేశం ఇచ్చారు. ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. ‘మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి. రిపబ్లిక్‌ డే వేడుకల్ని జరుపుకోవడం మన ఐక్యతకు నిదర్శనం. సరికొత్త ఆర్థిక విధానాలు చేపట్టిన టాప్‌-50 దేశాల జాబితాలో భారత్‌ చోటు సంపాదించడం గర్వకారణం. ప్రస్తుతం కోవిడ్‌ కష్టకాలం నడుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోటోకాల్‌ను ప్రతీ ఒక్కరూ విధిగా పాటించాలని రాష్ట్రపతి కోరారు.

ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్లు, హెల్త్‌ వర్కర్లు తమ ప్రాణాలను పనంగా పెట్టి కొవిడ్‌ రోగులను రక్షించిన విషయాన్ని స్మరించుకోవాలన్నారు రామ్ నాథ్ కోవింద్. కొవిడ్‌ మహమ్మారి వచ్చిన తొలి ఏడాదిలోనే మన హెల్త్‌ కేర్‌ సిస్టమ్‌ను బలోపేతం చేసుకోవడమే కాకుండా, ఆ మరుసటి ఏడాది వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను సక్సెస్‌ఫుల్‌గా విజయవంతం చేయడం మన బలానికి సంకేతం’ అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.