మంత్రి హరీశ్ రావుకు..భట్టి విక్రమార్క వినతి

మంత్రి హరీశ్ రావుకు..భట్టి విక్రమార్క వినతిహైదరాబాద్ : పేద, సామన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందడానికి యుద్ధ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మల్లు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు వినతిపత్రం అందజేశారు. మదిరలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావుతో కలిసి సీఎల్పీ లీడర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాతో పాటు మధిర నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న మౌలిక సమస్యలు, సిబ్బంది కొరత గురించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

సీజనల్ వ్యాధులు, కరోనా, ప్రసూతి, సాధారణ జబ్బులకు ప్రభుత్వ ఆసుపత్రిల్లో సక్రమంగా వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ముఖ్యంగా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, చింతకాని, బోనకల్లులో ఉన్న ఆరు పడకల ప్రభుత్వ ఆసుపత్రులను 30 పడకల కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆరు పడకల సామర్థ్యంతో నడుస్తున్న ఈ ఆస్పత్రుల్లో ఆ మండల ప్రజలకు అరకొరగా వైద్య సేవలు అందుతున్నాయన్నారు. మండల ప్రజలందరికీ సక్రమంగా వైద్యసేవలు అందడాని కి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం 30 పడకల సామర్థ్యానికి పెంచాలని మంత్రిని కోరారు.