10న స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ ప్రయోగం 

10న స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ ప్రయోగం

వరంగల్ టైమ్స్, సూళ్లూరుపేట : సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 10న ఉదయం 9.18 గంటలకు స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సమాయత్తమవుతున్నారు. ప్రయోగాన్ని 13.2 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి ఈ నెల 9న లాంచ్‌ రిహార్స్‌ల్స్‌ను, మధ్యాహ్నం 1 గంటకు మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.

ఎంఆర్‌ఆర్‌ సమావేశం అనంతరం ప్రయోగపనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు వారికి అప్పగిస్తారు. ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి 7 గంటల ముందు అంటే శుక్రవారం వేకువజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. ఈ ప్రయోగంలో ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్, జానుస్‌-01, ఆజాదీశాట్‌-02 అనే మూడు చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.