జగన్ జైలుకు..సీఎంగా షర్మిల : కడియం 

జగన్ జైలుకు..సీఎంగా షర్మిల : కడియం

జగన్ జైలుకు..సీఎంగా షర్మిల : కడియం వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మాజీ మంత్రి కడియం శ్రీహరి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల పై కీలక వ్యాఖ్యలు చేశారు. రేపో మాపో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలు కెళ్తారని, ఆయన సోదరి వైఎస్ షర్మిల ఏపీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు .

ఈ కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. ఆమె ఏ ప్రాంతంలో పాదయాత్ర చేపట్టినా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

ఇందుకు కౌంటర్‌గా కడియం శ్రీహరి ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. బడ్జెట్‌పై షర్మిల చేసిన కామెంట్స్ బాధాకరమన్నారు. వైస్ కుటుంబం మొదటి నుంచీ తెలంగాణకు వ్యతిరేకంగానే ఉందన్నారు. సమైక్యాంద్రే తమ నినాదం అని ఊరూర తిరిగిన వ్యక్తి షర్మిల అని ఈ సందర్భంగా కడియం గుర్తు చేశారు. అంతేకాదు పార్లమెంటులో జగన్ ప్లకార్డు పట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలను కూడా శ్రీహరి ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించారు.

తెలంగాణలో పర్యటించి టైం వేస్ట్ చేసుకోకు షర్మిల : కడియం
‘అవును నిజంగానే షర్మిలకు రాజకీయంగా అన్యాయం జరిగింది. వైఎస్ జగన్ సీబీఐ కేసులోజైలులో ఉన్నప్పుడు షర్మిల, విజయమ్మలు పాదయాత్రలు చేసి అధికారంలోకి తీసుకొచ్చారు. తల్లీ, చెల్లికి జగన్ రాజకీయంగా అన్యాయం చేశారు. మీకష్టంతో అధికారంలోకి వచ్చి మీకు అన్యాయం చేశారు. షర్మిల ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలకు మొర పెట్టుకోవాలి. రేపో మాపో సీబీఐ కేసులోనో, వివేకానందరెడ్డి హత్య కేసులోనో వైఎస్ జగన్ జైలుకు పోతే షర్మిలకు సీఎం అయ్యే అవకాశం వస్తుంది. అనవసరంగా తెలంగాణలో తిరిగి సమయాన్ని వృధా చేసుకోకు. షర్మిలకు తెలంగాణలో తిరిగే నైతికత లేదు. ఏపీలో జగన్ గ్రాఫ్ పడిపోతోంది’ అని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు.

రియాక్షన్ ఎలా ఉంటుందో..!
వాస్తవానికి వైసీపీపై ఎలాంటి కామెంట్స్ చేసినా ఏపీ నుంచి కూడా అంతే రీతిలో రియాక్షన్ కూడా వస్తోంది. ఇప్పుడు ఏకంగా జగన్ జైలుకెళ్తారు, గ్రాఫ్ పడిపోయిందని కడియం చేసిన కామెంట్స్‌పై ఎలాంటి కౌంటర్లు వస్తాయో మరి. ఇటు వైఎస్ షర్మిల కూడా తనపై కామెంట్స్ ఎవరూ చేసినా సరే ఎంత పెద్దోళ్లయినా లెక్కచేయకుండా తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్యనే ప్రజాసమస్యలపై తనతో కలిసి నడవాలని సీఎం కేసీఆర్‌కే ఒక జత బూట్లు ప్రగతిభవన్‌కు పంపించారు. మరి కడియం కామెంట్స్‌పై షర్మిల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది వేచి చూడాలి.