వేసవి సీజన్…టీటీడీ కొత్త ప్లాన్
వరంగల్ టైమ్స్, తిరుమల: వేసవి సీజన్‌లో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగే నేపథ్యంలో టీటీడీ ముందస్తు చర్యలు చేపడుతోంది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతోంది. డేటా ఆధారిత ప్రణాళికతో భక్తులకు మరింత మెరుగ్గా సౌకర్యాలు అందించడంతో పాటుగా దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. పరీక్షల కాలం వచ్చేసింది. మరికొన్ని రోజులలో వేసవి సెలవుల సీజన్ మొదలు కానుంది. దీంతో తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరగనుంది. పరీక్షలు పూర్తై సెలవులు రావటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలయాలకు క్యూ కడుతుంటారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవులలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టెక్నాలజీ సాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గత రెండు, మూడేళ్ల కాలంలో వేసవి సీజన్‌లో తిరుమల కొండకు ఎంతమంది భక్తులు వచ్చారనే సమాచారాన్ని విశ్లేషించుకుని, ఈ సీజన్‌లో తిరుమల శ్రీవారి దర్శనాల సంఖ్య, భక్తులు నిరీక్షించే సమయం, తర్వాతి రోజు దర్శనాల కోసం క్యూలైన్లలో ఎంతమంది భక్తులు వేచి ఉంటారనే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు పంపిణీతో పాటుగా.. నడక దారి భక్తుల కోసం మార్గమధ్యంలో షెడ్ల ఏర్పాటు చేయటం, మాడ వీధులలో కూల్ పెయింటింగ్, షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెంకయ్య చౌదరి వెల్లడించారు.
వేసవి తాపం నుంచి భక్తులకు ఉపశమనం కల్గించేందుకు మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. సెలవులు కావటంతో భక్తులు కుటుంబాలతో కలిసి శ్రీవారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఉందని. ఈ నేపథ్యంలో వారికి వసతి సదుపాయాలు, అన్నప్రసాదం నిర్వహణ వంటివి మరింత పకడ్బందీ అమలు చేస్తామన్నారు. నడకదారి, అధిక రద్దీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేస్తామని అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్న వెంకయ్య చౌదరి.. ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతికత వినియోగాన్ని పెంచుతామన్నారు. గంటల వారీగా ఎంతమంది భక్తులు దర్శనానికి వస్తున్నారు, ఎంతమంది దర్శనం పూర్తి చేసుకుని వెళ్తున్నారనే వివరాలను పరిశీలించటంతో పాటుగా, దర్శనం కోసం భక్తులు నిరీక్షించే సమయాన్ని పర్యవేక్షిస్తూతక్షణ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. డేటా ఆధారంగా కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలోని భక్తులు వేగంగా దర్శనం పొందేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.














