కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుని అనుగ్రహం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కల్పవృక్ష వాహనంపై ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి : క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిచ్చాడు శ్రీనివాసుడు. కాగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవలో ఎల్ ఏసీ ప్రెసిడెంట్ శ్రీ ఏ వి రెడ్డి, అర్చకులు, ఏఈవో శ్రీ రమేష్, టెంపుల్ ఇన్పెక్టర్స్ శ్రీ నిరంజన్, శ్రీ హరికృష్ణ, పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.














