ఇవి ట్రైలరే..అసలు సినిమా ముందుంది: కవిత
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేటీఆర్, బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తు విమర్శించారు. బంజారాహిల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ మున్సిపల్ ఎలక్షన్స్ ట్రైలర్ మాత్రమే.. సినిమా మిగిలే ఉందన్నారు. మేం పార్టీ పెడతామనగానే బీఆర్ఎస్ లీడర్లు కారు కూతలు కూస్తున్నరని మండిపడ్డారు.కాంగ్రెస్ అపొజిషన్ లో ఉన్నప్పుడు వచ్చిన ఫలితాలతో బీఆర్ఎస్ పోల్చుకుంటుంది.గతంలో 90 శాతం మున్సిపాలిటీల్లో గెలిస్తే ఇప్పుడు 16 స్థానాలకే పరిమితం అయ్యారు. ప్రజల ప్రేమను ఎందుకు కోల్పోయారో బీఆర్ఎస్ సమీక్షించుకోవాలన్నారు
సీపీఐ అడగకుండానే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించడం సిగ్గుచేటన్నారు.అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సాంబశివరావు కేసీఆర్ పై చేసిన ఆరోపణలను ఆమోదిస్తున్నారా? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ తో మిలాఖత్ అయిన సీపీఐ కి మద్దతివ్వటమంటే నయవంచనే అని విమర్శించారు.మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జాగృతికి చెందిన 40 మంది అభ్యర్థులను ప్రజలు గెలిపించారు.మా లాంటి కొత్త తరహా రాజకీయాల చేసే వారిని ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.అల్టర్ నేట్ లేకనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు. ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ఎక్కడ కూడా నిలబెట్టుకోకుండానే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచింది. ఇక ప్రజలు మాకు గుడి కట్టారంటూ ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకు పడిపోయింది. తెలంగాణకు రూపాయి ఇవ్వని బీజేపీ కరీంనగర్ మేయర్ స్థానం తప్ప అన్ని చోట్ల అష్టకష్టాలు పడింది. కానీ ఈ ఎన్నికల్లో మాలాంటి న్యూ ప్లేయర్ ను ప్రజలు ఆదరించారు. త్వరలోనే మేము రాజకీయ పార్టీగా మారబోతున్నామని చెప్పి ఎన్నికల్లో పోటీ చేశాం.
సమయం తక్కువగా ఉన్నప్పటికీ మా కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి పోటీ చేశాం. ప్రజలు మమ్మల్ని 40 స్థానాల్లో గెలిపించారు. అధికారికంగా 33 స్థానాలు అయినప్పటికీ కొంతమందికి భీ ఫామ్ ఇవ్వటంలో ఇబ్బంది అయ్యింది. అలా మరో ఏడు స్థానాల్లో మా అభ్యర్థులే గెలిచారు. వడ్డెపల్లి లో మాకు క్లియర్ మాన్ డేట్ ను ప్రజలు కట్టబెట్టారు. కానీ కాంగ్రెస్ వాళ్లు ప్రలోభాలు పెట్టి వారిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఛైర్మన్ ఎన్నిక వరకు ఏమీ జరుగుతుందో తెలియదు. అందుకే దాని గురించి మాట్లాడటం లేదు. ఇక నారాయణ్ పేట్ లో మాకు వైస్ ఛైర్మన్ ఆఫర్ చేస్తున్నారు. ఐతే దీనిపై లోకల్ నాయకత్వాన్నే నిర్ణయం తీసుకోమని చెప్పటం జరిగింది. ఇక మున్సిపల్ ఎన్నికల వాతావారణాన్ని తెలంగాణ ఆడబిడ్డగా పరిశీలించి చూస్తే చాలా బాధనిపించింది. గ్రామపంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో చట్టాలను, పరిమితులను ముఖ్యమంత్రి పూర్తిగా ఉల్లంఘించారు.
గ్రామ పంచాయితీ ఎన్నికల సమయంలో పట్టణాల్లో, మున్సిపల్ ఎన్నికల సమయంలో గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం నిర్వహించారు. అయినా కూడా ఈసీ పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు ప్రశ్నించలేదు. గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తమకు 17 స్థానాలు వచ్చుడే ఎక్కువ అన్నట్లుగా మాట్లాడారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు 5 శాతం సీట్లు కూడా రాలేదని అంటున్నారు. కాంగ్రెస్ అపొజిషన్ లో ఉన్నప్పుడు ఉన్న స్థానాలతో ఆయన పోల్చుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దానితో పోల్చుకుంటే బీఆర్ఎస్ చాలా స్థానాలు కోల్పోయింది.
రాష్ట్రంలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు.కచ్చితంగా మాలాంటి వాళ్లను ప్రజలు స్వాగతిస్తారని నమ్మకం ఉంది. ఈ ముఖ్యమంత్రి నేనే రాజు, నేనే మంత్రి అంటున్నారు. పదేళ్లు ముఖ్యమంత్రి నేనే. నాకు ఆరు నెలలు బోనస్ వస్తుందని చెబుతున్నారు. ముందు రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వాలి. అదే విధంగా మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం కుర్చీ లాక్కుంటా అని రాజ్ గోపాల్ రెడ్డి అంటున్నాడు. అందుకే ప్రజలకు ఇచ్చిన హామీలపై ముందు దృష్టి పెట్టాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అట్టర్ గా ఫెయిల్ అయ్యింది. ప్రజలకు అల్టర్ నేట్ లేకపోవటంతోనే కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఇక మేము రాజకీయ పార్టీగా వస్తామని అనగానే బీఆర్ఎస్ వాళ్లు ట్రోల్ చేయటం మొదలు పెట్టారు. వాళ్లకు ఏ సిర్ఫ్ ట్రైలర్ హై, పిక్చర్ బాకీ హై అని చెబుతున్నా. ఇప్పుడే కారుకూతలు కూయకండి అని హెచ్చరిస్తున్నా. ఉద్యమకారులను మంచి చేయాలని నేను మాట్లాడితే నా మీద ఇష్టమొచ్చినట్లు గా మాట్లాడుతున్నారు.
ఇలాంటి అహంకారం తగ్గించుకొని ప్రజల మధ్యలో ఉండకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేలా బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అన్నట్లుగా గా నార్త్ లో ఒకరికి ఒకరు సహకరించుకున్నారు. నేను ముందు నుంచి చెబుతున్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా భావించాలన్నారు. సింగరేణి కార్మికుల కోసం జాగృతి, హెచ్ఎంఎస్ మాత్రమే పనిచేస్తోంది. త్వరలో జరగబోయే సింగరేణి ఎన్నికల్లోనూ హెచ్ఎంఎస్, జాగృతి కలిసి పనిచేస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వాళ్లంతా కూడా రేపటి తరం నాయకులు. పార్టీల మాయలో పడి వార్డు సమస్యలను వదిలేయవద్దని సూచించారు..
రాజకీయాల్లో రాణించాలనుకునే యువ మిత్రులకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రయోగం లాంటివి. ఆ ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ ప్రక్రియను తెలుసుకోవాలి. ఎన్నికల్లో చాలా చోట్ల కూడా రీ కౌంటింగ్ పేరుతో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. గెలిపించిన అభ్యర్థులతో పనిచేయించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ప్రజలకు ఏ పార్టీ మీద నమ్మకం లేదని తెలుస్తోంది. అందుకే కొత్త తరహా రాజకీయాలను జాగృతి చేసి చూపిస్తుందన్నారు.ఈ విలేకరుల సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఆర్ వీ ఆర్ ప్రసాద్, జాగృతి ప్రధాన కార్యదర్శి ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.














