తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
L&Tనుంచి పూర్తిగా హైదరాబాద్ మెట్రో స్వాధీనం
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్పు
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మారుస్తూ నిర్ణయం
ఇకపై ప్రభుత్వ పరిధిలోకి టీవీవీపీ ఉద్యోగులు
ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపు
కాంగ్రెస్ ఆఫీసులకు జిల్లాల్లో భూకేటాయింపులు
మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో JNTU
JNTU కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాల కేటాయింపు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం.. భద్రతకు రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో దేశంలోనే ఆదర్శవంతమైన కొత్త పథకాలు అమలు చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు వ్యవహారం, వైద్య విధాన పరిషత్ లో మార్పులు, భూ కేటాయింపులపై కేబినెట్ ముద్ర వేసింది. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించింది.
ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహణలో ఉన్న మెట్రోను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసే దిశగా, ప్రైవేట్ భాగస్వామ్యం నుంచి మెట్రోను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణలోని వైద్య రంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పేరును ఇకపై డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పుతో పాటు, ఇప్పటివరకు పరిషత్ పరిధిలో ఉన్న ఉద్యోగులను పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని నిర్ణయించారు. దీనివల్ల వేలాది మంది వైద్య సిబ్బందికి లబ్ది చేకూరనుంది. రాజకీయ పార్టీల బలోపేతానికి సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతీ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మరికొన్ని కీలక భూకేటాయింపులపై కూడా కేబినెట్ స్పష్టతనిచ్చింది. ఖమ్మం జిల్లాలో టీటీడీ ఆలయ నిర్మాణం లేదా ఇతర ఆధ్యాత్మిక సేవల కోసం 20 ఎకరాల భూమిని కేటాయించారు. మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో కొత్తగా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణానికి గాను 70 ఎకరాల భారీ కేటాయింపుకు,శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో 36 ఎకరాలను కేటాయించింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది
హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు అవసరమైన 42 ఎకరాలను రక్షణ శాఖ (ఢిపెన్స్ ల్యాండ్) నుంచి తీసుకున్నందున Equal value of land (సమాన విలువైన భూములు) కింద రక్షణ శాఖకు కాప్రా మండలంలో 153 ఎకరాలు కేటాయించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. భద్రాచలంలో గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణానికి 5 ఎకరాల భూమిని రాష్ట్ర క్యాబినెట్ కేటాయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రం నిర్మాణానికి ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం గ్రామంలో 20 ఎకరాలు కేటాయించింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి 3 ఎకరాల 12 గుంటలను దేవాదాయ శాఖకు కేటాయించింది.
పరిపాలనా సౌలభ్యం కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం తీసుకున్న ఈ నిర్ణయాలు తక్షణమే అమలులోకి రానున్నాయి.ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తుంది. మొదటిది ఉద్యోగుల ప్రమాద బీమా పథకం- దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అందరికి, పెన్షనర్లకు ప్రమాద బీమా పధకం అమలు చేస్తుంది. ఉద్యోగులు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మన ప్రభుత్వం తొలిసారిగా సింగరేణిలో, ట్రాన్స్ కోలో ఉద్యోగ వర్గాలకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్కడ విజయవంతంగా అమలు చేసింది.
ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికి ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది.ఈ ప్రమాద బీమా అమలుతో ఒకవేళ ఎవరైనా ప్రమాదం లో మరణిస్తే రూ.1.2 కోట్లు ప్రమాద బీమా పరిహారం అందుతుంది.సహజ మరణానికి 60 ఏళ్ల వరకు ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్లు. ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5 లక్షల 19 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. వీరితో పాటు 2 లక్షల 38 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది.అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా బ్యాంకర్ల ద్వారా బీమా అమలు చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది.
ఉద్యోగులకు రెండో శుభవార్త-క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్- దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూస్తున్న మరో కోరికను రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నెరవేర్చింది.ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (EHS) అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.3 లక్షల 56 వేల మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మొత్తం 17.07 లక్షల మందికి ఈ పధకం వర్తిస్తుంది.ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఆసుపత్రుల్లో ఒక్క రూపాయి చెల్లించకుండానే వైద్య చికిత్సలు అందుతాయి.అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ఎంప్యానెల్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ పధకం వర్తిస్తుంది. దీనిపై మొత్తం 1998 వైద్య చికిత్సలు అందిస్తారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డ్ అందిస్తారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5 శాతం తమ వాటాగా చెల్లిస్తారు. అంతే సమాన వాటాను ప్రభుత్వం మ్యాచింగ్ వాటా చెల్లిస్తుంది.ఏడాదికి ఉద్యోగులు రూ. 528 కోట్లు తమ వాటాగా చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా రూ. 528 కోట్లు వాటా చెల్లిస్తుంది. మొత్తం రూ.1056 కోట్ల తో క్యాష్ లెస్ ఎంప్లాయి హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం. కుటుంబ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కల్పిస్తుందనడానికి ఈ పధకాలు నిదర్శనమని కేబినెట్ మొత్తం హర్షం వ్యక్తం చేసింది.
హెచ్ఎండిఎ విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను హెచ్ఎండిఎ పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్ పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్ పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను హెచ్ఎండిఎ పరిధిలో చేర్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాంప్రెహేన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (CRMP phase 2) చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ఫేస్ 1 లో ఉన్న 744 కిలోమీటర్లకు అదనంగా 300 కిలోమీటర్ల రోడ్లను ఫేస్ 2లో అభివృద్ధి. మెయింటెనెన్సు చేస్తారు.రూ. 3145 కోట్ల జీ హెచ్ ఎంసీ నిధులతో ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోమంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేస్ 1, ఫేస్ 2 ఆధునీకరణ ప్రాజెక్ట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ జల మండలి ప్రతిపాదనల మేరకు రూ. 722 కోట్ల తో ఈ ప్రాజెక్ట్ పనులకు నిర్ణయం తీసుకుంది. రూ. 282 కోట్లతో ఉస్మాన్ సాగర్ మంచినీటి పైప్ లైన్ ఆధునీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాలం చెల్లిన పైపులు. పంప్ హౌస్ల కారణంగా దాదాపు 30 శాతం నీటి సరఫరాలో నష్టం వాటిల్లుతోంది. ఇప్పుడున్న ప్రాజెక్టు ఆధునీకరిస్తే ఈ పరిస్థితి ఆదిగమించటంతో పాటు హైదరాబాద్ సిటీలో నీటి సరఫరా మెరుగు పడుతుంది.
రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన 223.09 ఎకరాల భూమిని TGIIC బదలాయించాలని నిర్ణయం తీసుకుంది.టీజీ హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉన్న 239 ఎకరాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన పండ్ల మార్కెట్ ఏర్పాటుకు వ్యవసాయ మార్కెటింగ్ విభాగానికి రాష్ట్ర క్యాబినెట్ కేటాయించింది.HMDA పరిధిలోని నియోపోలీస్ పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరాకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు గండిపేట మండలం కోకాపేటలో శారద పీఠానికి చెందిన స్థలాన్ని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ అండ్ సీవరేజీ బోర్డుకు కేటాయించడంతో పాటు శారద పీఠానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యూర్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర నిర్మించిన షాప్స్ వేలం వేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టుకోవడానికి ప్రయత్నించాలని చర్చించింది.క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 300 మెగావాట్ల విద్యుత్తు వినియోగించే డేటా సెంటర్లకు రెన్యుబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణన (census) 2027ను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది.నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హౌజ్ లిస్టింగ్ కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను వివరించారు. రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జన గణన ప్రక్రియలో పాలుపంచుకుంటారు. రెండో దశ జన గణన ప్రక్రియ వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి లో చేపట్టనున్నారు.














