ఆచూకీ దొరికింది..అమ్మాయిలు క్షేమం

వరంగల్ టైమ్స్, జీడిమెట్ల: తండ్రి మందలించాడనే కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కా చెల్లెళ్లు (21), (14) జీడిమెట్ల పోలీసులు క్షేమంగా గుర్తించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. జీడిమెట్ల ఇన్ స్పెక్టర్ గడ్డం మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇద్దరు అమ్మాయిలు ఇంటి నుంచి వెళ్లిపోయారని వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో ఆర్టీసీ బస్సుల వివరాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ సమీపంలో వీరి ఆచూకీని గుర్తించి వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలను క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చినందుకు జీడిమెట్ల పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.














