టీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే వరంగల్ వెనుకబడింది

టీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే వరంగల్ వెనుకబడింది

వరంగల్ అర్బన్ జిల్లా: వరంగల్ లో భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కేఎంసీ ఆవరణలో పీఎంఎస్ఎస్ వై కింద రూ.150 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సందర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీ గరికపాటి మోహన్ రావు, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ పర్యటనలో పాల్గొన్నారు. హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను తనిఖీ చేసి, వైద్య పరికరాలను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఇందులో భాగంగానే హాస్పిటల్ పనులపై కేఎంసీ ప్రిన్సిపల్ సంధ్యారాణి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేంద్రమంత్రికి వివరించారు. అనంతరం కేఎంసీ ఆవరణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే వరంగల్ వెనుకబడిందిపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే ఉద్దేశంతో 2014లో పీఎంఎస్ఎస్ వై ద్వారా కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిని వరంగల్ కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా, కేంద్ర ప్రభుత్వం 120 కోట్ల నిధులను మంజూరు చేసిందని , రాష్ట్రం ఇవ్వాల్సిన రూ.30 కోట్ల నిధుల్లో రూ.10 కోట్లు ఇవ్వడం వల్లే ఆసుపత్రి ఇంకా ప్రారంభం కాలేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రెండు మెడికల్ కాలేజీలను ఇచ్చిందని అన్నారు. ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు అందించి మూడేండ్లు గడుస్తున్నా ఇంత వరకు ఉపయోగంలోకి తేలేదని మండిపడ్డారు. పోస్ట్ పీజీ కి సంబంధించిన సీట్లు మంజురు అయినప్పటికీ ఆస్పత్రి ప్రారంభం కాకపోవడం వల్ల అది ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వ చొరవ, ఆఫీసర్ల సమన్వయ లోపం వల్ల ఆసుపత్రి ఆలస్య మైందని అన్నారు.