మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం..73శాతం పోలింగ్
7 కార్పొరేషన్లలో 66.05 శాతం పోలైన ఓట్లు
116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం పోలైన ఓట్లు
కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
వృద్ధులు ఓట్లు వేసేలా పోలీసుల సహాయం
మీడియాతో సమావేశమైన డిజిపి బి.శివధర్ రెడ్డి
13న 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
వరంగల్ టైమ్స్,హైదారాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ అధికారికంగా ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగింది. గడువు ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల చిన్నపాటి ఉద్రిక్తలు మినహా ఓటింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగానే ముగిసింది. మొత్తంగా 73.01 శాతం పోలింగ్ నమోదైంది. 7 కార్పొరేషన్లలో 66.05 శాతం, 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం ఓట్లు పోలయ్యాయి. మున్సిపాలిటీలకు సంబంధించి అత్యధికంగా చౌటుప్పల్ లో 91.91 శాతం, అత్యల్పంగా నందికొండలో 59.68 శాతం పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో అత్యధికంగా నల్గొండలో 77.36 శాతం, అత్యల్పంగా నిజామాబాద్ లో 59.12 శాతం ఓట్లు పోలయ్యాయి. పురుష ఓటర్లలో 72.63 శాతం, మహిళల్లో 73.39 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వృద్ధులు ఓట్లు వేసేందుకు పోలీస్ సిబ్బంది సహాయం చేశారు . నిజామాబాదులో సిపి పి. సాయి చైతన్య , నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, పెద్దపెల్లి డిసిపి బి రామ్ రెడ్డి వృద్ధ ఓటర్లను , వికలాంగులను వీల్ చైర్ లో పంపించారు. ములుగు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న నాలుగో బెటాలియన్ సిబ్బంది మూర్చ వచ్చి పడిపోయిన ఓటరుకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా అక్కడ ఉన్న వృద్ధ ఓటర్లను పోలింగ్ కేంద్రంకు తీసుకువెళ్లి ఓట్లు వేసేలా సహాయపడ్డారు. అదేవిధంగా, సంగారెడ్డి జిల్లా లోని జిన్నారం మండల పరిధికి చెందిన రాలకత్వలో వృద్ధులను ఆటోలు తీసుకువెళ్లి ఓట్లు వేసేలా తోడ్పాటు అందించారు. మహబూబాబాద్ జిల్లాలో ఓటర్ల పసిపిల్లలను వారు ఓటేసి వచ్చే వరకు శ్రద్ధగా పోలీస్ సిబ్బంది చూశారు.
గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. ప్రచార పర్వంలో నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వాతావరణాన్ని వేడెక్కించారు. అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. 116మున్సిపాలిటీల్లోని 2582 వార్డుల్లో 12 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 2569 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. కార్పొరేషన్ల పరిధిలోని 414 వార్డుల్లో కూడా 2 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 412 చోట్ల ఓటర్లు తమ తీర్పును ఇచ్చారు. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది.
పోలీసు డైరెక్టర్ జనరల్ బి.శివధర్ రెడ్డి బుధవారం తన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి శాంతిభద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్‌తో కలిసి ఆయన రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా పర్యవేక్షించారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌ను వెబ్‌కాస్టింగ్ ద్వారా నేరుగా వీక్షిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు జారీ చేశారు. మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ అధికారికంగా ముగిసిన తర్వాత రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ బి.శివధర్ రెడ్డి ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిజిపి మాట్లాడారు. వెబ్‌కాస్టింగ్ విధానం ద్వారా రాష్ట్రంలోని పోలింగ్ స్టేషన్ల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలిగిందని, ఈ కెమెరాల నిఘా కారణంగాను, పోలీస్ సిబ్బంది బందోబస్తు వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అదుపులో ఉన్నాయన్నారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంలో పోలీసు సిబ్బంది అంకితభావంతో పాటు ఈ ఆధునిక వెబ్‌కాస్టింగ్ సాంకేతికత ఎంతగానో తోడ్పడిందని ఆయన ప్రశంసించారు.
ఈ ఎన్నికల కోసం తెలంగాణ పోలీసులు అత్యంత పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారని డీజీపీ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్లను కవర్ చేస్తూ భారీ ఎత్తున భద్రతను కల్పించామన్నారు. వీటిలో 1,302 అత్యంత సమస్యాత్మక (హైపర్ సెన్సిటివ్), 1,926 సమస్యాత్మక (సెన్సిటివ్) మరియు 4,975 సాధారణ కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల తీవ్రతను బట్టి బలగాలను మోహరించినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖతో పాటు ఇతర విభాగాల నుంచి సుమారు 3,000 మంది అదనపు బలగాలను రప్పించామని, ఇందులో టీజీఎస్పీ, ఫారెస్ట్, ఎక్సైజ్, సీఐడీ మరియు లీగల్ మెట్రాలజీ విభాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం లోపల మరియు అత్యంత సమస్యాత్మక కేంద్రాల వెలుపల వంద శాతం వెబ్‌కాస్టింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నామని, దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత సాధ్యమైందని ఆయన వెల్లడించారు.











