తొర్రూరు పీఠం దయన్న కైవసం

తొర్రూరు పీఠం దయన్న కైవసం

తొర్రూరు పీఠం దయన్న కైవసంవరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు మున్సిపాలిటీపై విజయకేతనం ఎగురవేయడం లక్ష్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన ప్రయత్నం ఫలించింది. ఫలితంగా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 16 వార్డులకు గాను, 10 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుని ఘన విజయాన్ని సొంతం చేససుకుంది. ఈ విజయంతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికలలో పాలకుర్తి నియోజకవర్గం చాలా కీలకంగా మారి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. పాలకుర్తి నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకుడు, ఓటమి ఎరుగని నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేయగా, ఆయన పైన యువనాయకురాలు, ఎన్నారై ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డి ఎన్నికల బరిలో దిగారు.

దయాకర్ రావును ఓడించి యశస్విని ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టించారు. ఇక అప్పటి నుంచి మళ్లీ పాలకుర్తి నియోజకవర్గంలో సత్తా చాటాలని నిరీక్షిస్తున్న మాజీ మంత్రి దయాకర్ రావుకు మున్సిపల్ ఎన్నికలు అందుకు తగిన ఉత్సాహాన్ని నింపాయనే చెప్పవచ్చు. గడపగడప తడుతూ, ప్రతీ ఒక్కరిని పలకరిస్తూ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన దయాకర్ రావు కేటీఆర్ ని కూడా పిలిపించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఏదిఏమైనా దయన్న కంచుకోటగా ఉన్న పాలకుర్తి తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకోవడంతో ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు తన క్యాడర్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ జోష్ తో తొర్రురు మున్సిపాలిటీలో గెలుపొందిన వారిని అభినందించారు. వారితో విజయోత్సవ సంబరం చేసుకున్నారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు తొర్రూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న బీఆర్ఎస్ నాయకులు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి వేద పండితుల నడుమ దైవమంత్రోచ్ఛరణతో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మాజీ మంత్రితో పాటు పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తొర్రూరు మున్సిపాలిటీలో గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.