జ‌గ‌న్ పాల‌న‌లోనే బీసీల‌కు స‌ముచిత స్థానం

జ‌గ‌న్ పాల‌న‌లోనే బీసీల‌కు స‌ముచిత స్థానంవిజ‌య‌వాడ‌‌: చరిత్రలో నిలిచిపోయే యుగపురుషుడు మహాత్మా జ్యోతిరావు పూలె ఆత్మకు నిజమైన నివాళిగా ఆయన ఆలోచనలను ఆచరణలో అమలు చేస్తున్న వైయస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం బీసీల‌కు అన్ని విధాలా అండగా నిలుస్తోందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం విజ‌య‌వాడ‌లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలోని మహాత్మా జ్యోతీరావుపూలే 131వ వర్ధంతి దినోత్సవం పురస్కరించుకుని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళుల‌ర్పించారు. బిసిలు అంటే సమాజానికి వెన్నుముక లాంటివారని భావించి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వారి అభ్యున్నతికి ఇతోధికంగా కృషి చేయడం జరుగుతోందని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. పూలె ఆశయాలను అమలు చేస్తున్న ప్రభుత్వం త‌మ‌దేన‌న్నారు. 56 కార్పోరేషన్‌లను వెనుకబడిన తరగతులవారి కోసం ఏర్పాటుచేసి ప్రాముఖ్యతను గుర్తించడం జరిగిందన్నారు. నిజంగా ఈ ప్రభుత్వ హయాంలోనే పూలె ఆత్మ శాంతిస్తుందని ఆయన అన్నారు. మహాత్మా జ్యోతిరావుపూలె మరణించి 130ఏళ్లు పూర్తైనా ఆయన ఆశయాలను అమలు చేయడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని తెలిపారు. ప్రత్యేకంగా బడుగు, బలహీనవర్గాల కోసం మహిళల సమపాలన కోసం నాడు జ్యోతీరావుపూలె నాంది పలికారని వాటి అమలుకు జగన్ ప్ర‌భుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామని, విద్య యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, గోరుముద్ద వంటి ఎన్నో విద్యావ్యాప్తి దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలకు 50 శాతం అన్నిరంగాల్లో కల్పించడం జరుగుతోందని, గతంలో కేవలం కొన్ని పదవులలో నామమాత్రంగా మహిళలకు కేటాయించేవారని మంత్రి తెలిపారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల ప్రాధాన్యతను గుర్తించి అన్ని సంక్షేమ కార్యక్రమాలలో వారిని భాగస్వామ్యం చేయడంతో పాటు ఛైర్మన్లు, కార్పోరేషన్ల డైరెక్టర్లు, దేవాదాయ ధర్మాదాయశాఖ, ఇతర శాఖల కాంట్రాక్టర్లు, పనుల కేటాయింపుల్లోనూ రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా 50 శాతం మహిళలకు కేటాయించిన‌ట్లు చెప్పారు. కార్య‌క్ర‌మంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్, వెనుకబడి తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి బి.రామారావు, వివిధ కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కృష్ణాజిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటి డైరెక్టర్‌ కె.సరస్వతి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.