న్యూఢిల్లీ: ఇండియాలో రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ మనుషులపై ప్రయోగాలు ఈ వారంలోనే మొదలైయే అవకాశాలు ఉన్నాయి. మనుషులపై ప్రయోగాలు చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని, అన్ని అనుమతులూ తీసుకున్నామని ఒక అధికారి వెల్లడించారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ కూడా ఈ విషయాన్ని గత వారంలోనే ధృవీకరించారు. ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ రెండింటినీ కలిపి చేయనున్నట్లు ఆయన తెలిపారు. మాస్కోకు చెందిన గమలేయా ఇన్‌స్టిట్యూట్ ఈ స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇండియాలో ఈ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్, ట్రయల్స్ కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌తో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌లో భాగంగా ఆర్డీఐఎఫ్ పది కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డీస్‌కు సరఫరా చేయనుంది. అత్యవసర వాడకం, ప్రీక్వాలిఫికేషన్ కోసం ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు రష్య దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో మొత్తం ఐదు కొవిడ్-19 వ్యాక్సీన్‌లు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నాయి. నాలుగు వ్యాక్సీన్‌లు ఫేజ్ 3, 3 ట్రయల్స్‌లో ఉండగా.. ఒక వ్యాక్సీన్ ఫేజ్ 1, 2 ట్రయల్స్‌లో ఉంది.