డీఎస్పీ ఇంట్లో దొరికిన ఆయుధ సామగ్రి

డీఎస్పీ ఇంట్లో దొరికిన ఆయుధ సామగ్రికామారెడ్డి జిల్లా: కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను అక్రమాస్తుల కేసులో ఎసిబి అధికారులు అరెస్ట్‌ చేశారు. కామారెడ్డి జిల్లాలో క్రికెట్ పందాల కేసులో నిందితుల నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో సీఐ జగదీశ్, ఎస్సై గోవింద్ లతో పాటు డీఎస్పీ లక్ష్మీనారాయణ కార్యాలయం, ఇళ్లల్లో ఎసిబి అధికారులు గత నెలలో సోదాలు నిర్వహించారు. బెట్టింగ్ కేసులో డీఎస్పీ పాత్ర లేదని నిర్ధారణకు వచ్చారు. అయితే తీగ లాగితే డొంక కదిలినట్లు..సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు అక్రమంగా దాచిన తూటాలు వెలుగులోకి వచ్చాయి. గత నెల 27న ఎసిబి నిజామాబాద్ రేంజ్ ఇంఛార్జి డీఎస్పీ ఆనంద్ కుమార్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ రేంజ్ ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ , రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించిన సోదాల్లో లక్ష్మీనారాయణకు రూ.2.12 కోట్ల విలువ చేసే నగదు, బంగారం, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని ఇళ్లల్లో తనిఖీ చేయగా భారీగా తూటాలు లభించాయి. దీనిపై ఎసిబి ఫిర్యాదు మేరకు తిరుమలగిరి స్టేషన్‌లో కేసు నమోదైంది. అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లినప్పుడు మిగిలిన అదనపు రౌండ్లని ఎసిబి అధికారుల విచారణలో డీఎస్పీ చెప్పినట్లు తెలిసింది. ఈక్రమంలోనే డీఎస్పీ ఆసుపత్రిలో చేరి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, ఎసిబి అధికారులు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేయించి మరీ అరెస్టు చేశారు. కరీంనగర్‌లోని ఎసిబి న్యాయమూర్తి ముందు ఆదివారం హాజరు పరిచినట్లు ఎసిబి డీజీ ఓ ప్రకటనలో వెల్లడించారు. అతని నుంచి 9 ఎం.ఎం.వి, 1 క్యాట్రిడ్జ్‌, 9 తూటాలు, ఎస్‌ఎల్‌ఆర్‌(7.62)వి 2 క్యాట్రిడ్జ్‌లు, 5 తూటాలు; 0.303 గన్‌వి 3 క్యాట్రిడ్జ్‌లు, 2 తూటాలు; 0.22 గన్‌వి 4 క్యాట్రిడ్జ్‌లు, 2 తూటాలు; ఏకే -47గన్‌వి 5 క్యాట్రిడ్జ్‌లు, 12 తూటాలు; ఏకే -47వి 6 షెల్స్‌; 9 ఎంఎం గన్‌వి 1 షెల్‌లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.