మహిళలకు మెరుగైన జీవనోపాధే లక్ష్యం..‘జగనన్న జీవక్రాంతి’ పథకం ప్రారంభంలో సీఎం జగన్ అమరావతి : ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. అక్క చెల్లెమ్మలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.. వారి ముఖాల్లో సంతోషం ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని మరోసారి భరోసా ఇస్తున్నాను. అక్కచెల్లెమ్మలు చేపట్టబోయే వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లాలి. వారికి ఇంకా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఇన్నాళ్లూ నిర్లక్ష్యం ఉంది. వాటిని బాగుచేయాలని గత ప్రభుత్వాలు ఏనాడూ భావించలేదు. చిత్తశుద్ధితో పథకాలు చేపడితే ఎలా ఉంటాయన్న దానికి ఉదాహరణే ఇప్పుడు మనం అమలు చేస్తున్న పథకాలు అన్నారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లో మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో చేపట్టిన మేకలు, గొర్రెల పంపిణీ ‘జగనన్న జీవక్రాంతి’ పథకాన్ని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టగా మొత్తం రూ.1869 కోట్ల వ్యయంతో పథకం అమలు చేస్తున్నారు. కార్యక్రమం ప్రారంభంలో వైఎస్ జగన్‌కు గొంగడి కప్పి, తాటి ఆకులతో రూపొందించిన గొడుగు, మేక పిల్లను లబ్ధిదారులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పథకం ప్రారంభం అనంతరం వివిధ జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ మాట్లాడారు.