ఏలూరు బాధితుల‌కు సీఎస్ ప‌రామ‌ర్శ‌

ఏలూరు బాధితుల‌కు సీఎస్ ప‌రామ‌ర్శ‌ఏలూరు ‌: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్క‌ని వ్యాధి బారిన ప‌డిన బాధితుల‌ను ప్ర‌భుత్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహాని ప‌రామ‌ర్శించారు. గురువారం ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి బాధితులతో మాట్లాడారు. తాగడానికి ఏ నీటిని వినియోగిస్తున్నార‌ని చికిత్సపొందుతున్నవారిని అడగగా కుళాయి నీటిని వినియోగిస్తున్నట్లు బాధి‌తులు తెలిపారు. ఇప్పుడు ఎలా వుంది. వైద్యం బాగా జరుగుతుందా..? అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సహాయం ఏ విధంగా అందిస్తున్నారు, వ్యాధి తీవ్రత, ఇప్పటివరకు సేకరించి నివేదికలు తదితర వివరాలను డీసీహెచ్ఎస్‌ను అడిగారు. పట్టణంలో ఏ ప్రాంతంలో ఈ వ్యాధి ఎక్కువగా వుంది, ఇప్పటి వరకు ఎంతమంది అడ్మిట్ అయ్యారు, ఎంతమంది డిశ్చార్జ‌య్యారు. నిన్నటికి ఈ రోజుకు కేసులు నమోదు సంఖ్యలో వ్యత్యాసం తదితర వివరాలను జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సీఎస్‌కు వివరించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా అధికారులతో, డాక్టర్లతో సమావేశమై ఘ‌ట‌న‌కు దారితీసిన పరిస్థితులు, చేపట్టిన చర్యలు, ఇప్పటివరకు అందిన నివేదికలపై క్షుణ్ణంగా సమీక్షించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఇన్‌చార్జి డీసీహెచ్ఎస్ డాక్ట‌ర్ ఏవీఆర్ మోహన్, డీఎం అండ్ హెచ్‌వో ఏకే సునంద, పలువురు వైద్య నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.