నేడు వరంగల్ లో పర్యటించనున్న కిషన్ రెడ్డి

నేడు వరంగల్ లో పర్యటించనున్న కిషన్ రెడ్డివరంగల్ అర్బన్ జిల్లా: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో తమ బలాన్ని నిరూపించుకున్న బీజేపీ రాబోయే వరంగల్ ,ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ సత్తా చాటుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఆ దిశగా రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి నేతలు జిల్లాల్లో బీజేపీ బలాన్ని పెంచే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈనేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేడు వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించనున్నారు. కిషన్ రెడ్డి పర్యటనపై వివరాలను వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ మీడియా సమావేశం ద్వారా తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు భద్రకాళీ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 9గంటల45 నిమిషాలకు కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో నిర్మిస్తున్న పిఎంఎస్ఎస్ వై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను తనిఖీ చేస్తారు. ఉదయం 11 గంటలకు భద్రకాళి బండ్ నిర్మాణం పనులను పరిశీలిస్తారు. 11గంటల 50 నిమిషాలకు బుగులోని గుట్టకు వెళ్తారు. మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాలకు సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో వరంగల్ రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటల 30 నిమిషాలకు టివిఆర్ ఫంక్షన్ హాల్ లో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు వరంగల్ పర్యటన ముగించుకుని సూర్యాపేటకు బయలుదేరుతారని రావు పద్మ మీడియాకు తెలిపారు.